• May 26, 2026
  • NPN Log

    దేశవ్యాప్తంగా బక్రీద్‌(ఈద్‌ అల్‌ అధా) వేడుకలకు సన్నాహాలు జరుగుతున్న వేళ ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. బక్రీద్ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో నమాజ్‌‌ల నిర్వహణ, జంతుబలిని అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు లఖ్‌‌నవూలో సోమవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులకు సీఎం యోగి పలు సూచనలు చేశారు. ప్రార్థనలు కేవలం మసీదులు, ఈద్గాహ్‌ల పరిధిలోనే జరగాలని.. రోడ్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో అనుమతి ఉండదని తెలిపారు. ఒకవేళ అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే పరిస్థితి ఉంటే షిఫ్టుల్లో నమాజ్ నిర్వహించాలని సూచించారు. అలాగే.. జంతుబలి విషయంలోనూ కఠిన నిబంధనలు అమలు చేయాలని యోగి సర్కార్ నిర్ణయించింది. బహిరంగ ప్రదేశాల్లో కుర్బానీ పూర్తిగా నిషేధమని, ప్రభుత్వం నిషేధించిన జంతువులను బలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. కుర్బానీ అనంతరం కూడా పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని, సరైన పారిశుద్ధ్య ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది.

    బక్రీద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖను అప్రమత్తం చేశారు సీఎం యోగి. రాష్ట్రంలోని సున్నిత ప్రాంతాలు, ఈద్గాహ్‌లు, మసీదుల వద్ద అదనపు భద్రతా బలగాలను మోహరించాలని ఆదేశించారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. అల్లర్లకు ప్రేరేపించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని పేర్కొన్నారు.

    బక్రీద్ సందర్భంగా సీఎం యోగి జారీచేసిన 10 కీలక ఆదేశాలివే..

    మసీదు ఆవరణలోనే నమాజ్ నిర్వహించాలి.

    ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు చేయరాదు.

    ప్రార్థనల కోసం రహదారులను అడ్డుకోకూడదు.

    జనం ఎక్కువగా ఉంటే, ప్రార్థనలను విడతల వారీగా నిర్వహించాలి.

    బహిరంగ ప్రదేశాలలో ఏ రూపంలోనూ జంతుబలి జరగరాదు.

    నిషేధిత జంతువుల బలి పూర్తిగా నిషేధించాలి.

    జంతు బలుల తర్వాత పరిశుభ్రత పాటించాలి.

    అల్లర్లు సృష్టించే వారిపై అధికారులు ప్రత్యేక నిఘా ఉంచాలి.

    ఈద్గాహ్‌ల వద్ద పోలీస్ బలగాలు మోహరించాలి.

    సున్నితమైన ప్రాంతాలలో సీసీటీవీ కెమెరాలు, డ్రోన్‌లతో నిఘా చేపట్టాలి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement