• May 26, 2026
  • NPN Log

    తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం ఈరోజు (బుధవారం) జరిగింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. రూ.4.55 కోట్లతో సర్వదర్శనం క్యూ లైన్లలో అదనపు టాయిలెట్లు నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. తిరుమలలోని వీధులకు పేర్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

    కోయంబత్తూర్‌లో ఆలయం నిర్మిస్తాం..

    టీటీడీ విద్యాశాఖకు అదనంగా రూ.43.44 కోట్లు కేటాయించామని బీఆర్ నాయుడు తెలిపారు. గోగర్భం డ్యామ్ వద్ద రూ.6 కోట్లతో అదనపు పైప్‌లైన్ నిర్మాణం చేపడతామని అన్నారు. రూ.44.2 కోట్లతో ఆప్కో, కో అప్టెక్స్ నుంచి పట్టువస్త్రాలు, శాలువలు కొనుగోలు చేస్తామని తెలిపారు. పాడేరులో రూ.55 లక్షలతో శివాలయం నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. అక్షర గోవిందం కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు ఉచితంగా కిట్లు కేటాయిస్తామని తెలిపారు. చెన్నైలోని కోయంబత్తూర్‌లో జీ స్క్వేర్ సంస్థ విరాళంగా ఇచ్చిన 19.53 ఎకరాలను టీటీడీ స్వాధీనం చేసుకొని ఆలయాన్ని నిర్మిస్తామని పేర్కొన్నారు. నవీ ముంబైలో సంప్రోక్షణ కార్యక్రమం కోసం అవుట్ సోర్సింగ్ సిబ్బంది నియమకం కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని తెలిపారు. నవీ ముంబైలో శ్రీవారి ఆలయం పక్కనే అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఆమోదించామని చెప్పుకొచ్చారు. రూ.2.7 కోట్లతో తుళ్లూరులో రాజగోపురం నిర్మాణానికి ఆమోదం తెలిపామని బీఆర్ నాయుడు పేర్కొన్నారు.

    టీటీడీ ఆస్థాన విద్వాన్‌గా శోభరాజ్ నియమకం..

    వెంకటాయపాలెంలోని శ్రీవారి ఆలయంలో పలు అభివృద్ధి పనులకు రూ.46.95 కోట్ల నిధులు కేటాయించామని బీఆర్ నాయుడు తెలిపారు. రూ.3.61 కోట్లతో వరాహస్వామి అతిథి గృహ ఆధునికీకరణ పనులు చేపడతామన్నారు. అలిపిరి వద్ద శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం నిర్వహణకు రూ.4.71 కోట్లతో యాగశాల నిర్మాణానికి ఆమోదించామని చెప్పారు. తిరుమలలో పరిపాలన భవనం నిర్మాణానికి ఆమోదించామని అన్నారు. టీటీడీ ఆస్థాన విద్వాన్‌గా శోభరాజ్‌ను నియమించినట్లు తెలిపారు. సత్యసాయి జిల్లా లేపాక్షిలో కల్యాణమండపం నిర్మాణానికి నిధులు కేటాయించామని చెప్పారు. ఖమ్మంలో ప్రభుత్వం ఇచ్చిన 20 ఎకరాల్లో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. టీటీడీలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఐడీ కార్డుతో పాటు శ్రీవారి దర్శనం కల్పిస్తామని చెప్పుకొచ్చారు. ఉద్యోగులకు ఇచ్చే వైద్య ఖర్చులను రూ.3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచుతున్నామని తెలిపారు. అలిపిరి వినాయక ఆలయం వద్ద రూ.4.7 కోట్లతో బస్సుల తనిఖీకి నూతనంగా షెడ్‌ను నిర్మిస్తామని అన్నారు. ఉద్యోగుల ఇళ్ల స్థలాల అభివృద్ధికి పాలకమండలి సభ్యులతో ఓ కమిటీ నియమించినట్లు చెప్పారు. అలిపిరి వద్ద టౌన్ షిప్ నిర్మాణానికి త్వరలోనే భూమి పూజ చేస్తామని అన్నారు. తిరుపతిలో భారీ గోడౌన్ నిర్మాణానికి ఆమోదం తెలిపామనన్నారు. వేసవి సెలవుల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. జూలై 15వ తేదీ వరకూ ప్రజాప్రతినిధుల సిఫార్సుపై కేటాయించే బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని తెలిపారు. రాతి రథమండపం నిర్మాణంపై చర్చించామని.. త్వరలోనే ఓ నిర్ణయాన్ని ప్రకటిస్తామని బీఆర్ నాయుడు పేర్కొన్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement