కాఫీ ఇలా తాగాలి
ఉదయం నిద్ర లేవగానే కాఫీ తాగనిదే మనకు రోజు మొదలవదు. అయితే ఆ కాఫీని ఎలా తయారు చేసుకుంటున్నాం? డికాక్షన్‌కు పాలు, చక్కెర కలిపి తాగితే, కాఫీ ప్రయోజనాలు అందే అవకాశం ఉండదు. కాఫీలోని మహత్తర ప్రయోజనాలు దక్కాలంటే ఇదిగో ఇలా తాగాలి
కప్పు కాఫీలో 220 నుంచి 250 మిల్లీగ్రాముల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే కాఫీ రకాన్ని బట్టి 15 నుంచి 325 మిల్లీగ్రాముల క్లోరోజెనిక్ ఆమ్లాలు కూడా ఉంటాయి. అలాగే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ అలర్జిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలున్న ఫెర్యూలిక్ ఆమ్లం కూడా కాఫీలో ఉంటుంది. ఈ గుణాలకు తోడు మరిన్ని ఆరోగ్యకరమైన పోషకాలను శరీరానికి అందించాలనుకుంటే, బ్లాక్ కాఫీకి ఇంకొన్ని పదార్థాలు అదనంగా జోడించుకోవాలి. అవేంటంటే...
సోయా లేదా బాదం: సోయా పాలలో గుండె, మూత్రపిండాలు, కాలేయాల ఆరోగ్యాలకు తోడ్పడే సహజసిద్ధ కాంపౌండ్స్ ఉంటాయి. బాదం పాలలో గుండెకు మేలు చేసే మోనోశాచురేటెడ్ కొవ్వులుంటాయి. కాబట్టి ఈ రెండింట్లో ఏదో ఒకదాన్ని బ్లాక్ కాఫీలో కలుపుకోవాలి
దాల్చిన చెక్క: రక్తంలోని చక్కెరను నియంత్రించి, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించే గుణం దాల్చిన చెక్కకు ఉంటుంది. కాబట్టి బ్లాక్ కాఫీలో కొద్దిగా దాల్చిన చెక్క పొడిని కలుపుకోవాలి
కోకో పౌడర్: దీన్లోని క్యాటెచిన్స్, ప్రొసయానిడిన్స్ అనే పాలీఫెనాల్స్ మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి గుండెకు మేలు చేస్తాయి.పాలీఫెనాల్స్, పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా మారి పేగుల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది
ఎమ్‌సిటి ఆయిల్: మెదడు పనితీరును మెరుగుపరిచి, ఏకాగ్రతను సమకూరుస్తుంది. కొబ్బరి, పామ్ నూనెల నుంచి సేకరించే ఈ ఎమ్‌సిటి నూనె, పేగుల్లో కాఫీ అరుగుదలను, పోషకాల శోషణను పెంచుతుంది.









Comments