• Aug 25, 2026
  • NPN Log

    ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్  నివాసానికి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత శుక్రవారం విచ్చేశారు. ఇటీవల బండ్ల గణేష్ కుమార్తె జనని, అల్లుడు సూర్య తేజల వివాహం హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు అందరూ విచ్చేశారు. ఇక ఈ వివాహానికి పరిటాల శ్రీరామ్, పరిటాల సిద్ధార్థ హాజరైనప్పటికీ కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల వల్ల ఎమ్మెల్యే పరిటాల సునీత హాజరుకా లేకపోయారు. ఈ క్రమంలో ఫిల్మ్ నగర్‌లోని బండ్ల గణేష్ నివాసానికి స్వయంగా వెళ్లిన సునీతకు, గణేష్ దంపతులు సాదరంగా ఘన స్వాగతం పలికారు.

    ఈ ఆత్మీయ కలయిక సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత నూతన వధూవరులకు ధర్మవరం పట్టు వస్త్రాలు బహుకరించి, వారి దాంపత్య జీవితం సంతోషంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. అనంతరం బండ్ల గణేష్ కుటుంబ సభ్యులతో కలిసి ఆమె కాసేపు సరదాగా, ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా దివంగత నేత పరిటాల రవితో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని బండ్ల గణేష్ గుర్తుచేసుకున్నాడు. ఐకానిక్ సినిమా శ్రీరాములయ్య చిత్రంలో నటించే సమయం నుంచే పరిటాల కుటుంబంతో తనకు ఎంతో గాఢమైన బంధం ఏర్పడిందని, పరిటాల రవితో గడిపిన రోజులు ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మరువలేనిదని గణేష్ భావోద్వేగంగా వెల్లడించాడు. దశాబ్దాలు గడుస్తున్నా తమ కుటుంబాల మధ్య ఉన్న ప్రేమానురాగాలు ఇలాగే కొనసాగడం పట్ల ఇరు వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి.

    సోషల్ మీడియా వేదికగా బండ్ల తన ఆనందాన్ని పంచుకున్నాడు. 'మా ఆత్మీయురాలు, మా వదిన పరిటాల సునీతగారు ఈరోజు ప్రత్యేకంగా మా ఇంటికి వచ్చి, నా కుమార్తెను, అల్లుడిని ఆశీర్వదించి వెళ్లడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మీరు చల్లగా, చక్కగా, ఆనందంగా ప్రజా సేవ చేస్తూ, పరిటాల రవన్న పేరును ఇంకా చిరస్థాయిగా నిలిచే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు' అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement