• May 26, 2026
  • NPN Log

    తిరుమల : సమర్థవంతమైన క్యూ లైన్ల నిర్వహణతో వారం రోజుల వ్యవధిలో 5.20 లక్షల మంది సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం లభిం చింది. వేసవి సెలవులు, పదవ తరగతి పరీక్షల ఫలితాల నేపథ్యంలో రద్దీ అధికంగా నెలకొనే అవకాశా లున్నాయనే అంచనాతో టీటీడీ ముందస్తు ప్రణాళికలు రూపొందించిన క్రమంలో అధికారులు అత్యధికంగా భక్తులకు దర్శనం చేయించగలిగారు. వాస్తవానికి నెల రోజుల ముందే టీటీడీ వేసవి ఏర్పాట్లు పూర్తిచేసింది. పైగా, ఏప్రిల్‌ 27వ తేదీ నుంచే సిఫారసు లేఖలపై ఇచ్చే వీఐపీ బ్రేక్‌ దర్శనాలను కుదించుకుంటూ వచ్చి ఈ నెల ఒకటో తేదీ నుంచి పూర్తిస్థాయిలో రద్దు చేయడంతో పాటు స్లాటెడ్‌ సర్వదర్శనం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలను పరిమితం చేసింది. ఈ క్రమంలో సామాన్య భక్తులకే అధిక దర్శన సమయం లభించింది. ప్రత్యేకించి రెండు గంటల పాటు జరిగే అభిషేక సేవ ఉన్న శుక్రవారం కూడా 71,008 మందికి శ్రీవారి దర్శనం చేయించగలిగారు. గత శనివారం 91,008 మంది, ఆదివారం 83,091 మంది చొప్పున మొత్తం మూడు రోజుల్లో 2,45,104 మందికి స్వామి దర్శనం లభించింది. వీరిలో సామాన్య భక్తులే అధికం కావడం విశేషం. మరోవైపు నిరీక్షణ సమయం కూడా భారీగా తగ్గింది. గతంలో 12 నుంచి 20 గంటల పాటు ఉండే దర్శన నిరీక్షణ సమయం తగ్గిపోయి కేవలం 8 గంటల వ్యవధిలోనే సామాన్య భక్తులకు స్వామి దర్శనం లభించింది. మరోవైపు కంపార్టుమెంట్లు, షెడ్లు, వెలుపల క్యూలైన్లలోని భక్తులకు నిరంతరాయంగా అన్నపానీ యాలను సరఫరా చేయడంతో దర్శనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి నిరంతరం వివిధ విభాగాల అధికారులను అప్రమ త్తం చేస్తూ సమన్వయంతో దర్శనాలు చేయించారు. ఇంటి గ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా ఎప్పటికప్పుడు రద్దీపై నిఘా ఉంచి దర్శనాలు చేయించారు.

    ఇక 27వ తేదీ నుంచి 3వ తేదీ వరకు 2.16 లక్షల మంది తలనీలాలు సమర్పించగా, ఈ వారంరోజుల్లో రూ.28.58 కోట్ల హుండీ ఆదాయం లభించింది. 23.78 లక్షల మందికి అన్నప్రసాదాలు అందజేశారు. రూ.10.56 కోట్ల విలువైన 26.28 లక్షల లడ్డూలు విక్రయాలు జరిగాయి. రూ.84.80 లక్షల బంగారు డాలర్లను భక్తులకు విక్రయించారు. అలాగే 73,107 వాహనాలు తిరుమలకు వచ్చి వెళ్లాయి. ఇక, సోమవారం తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. తమిళనాడు ఎన్నికల ఫలితాల ప్రభావంతో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కేవలం రెండు గంటల వ్యవధిలోనే శ్రీవారి దర్శనం లభించింది.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement