అసెంబ్లీ ఎన్నికలు.. భారీగా మద్యం, డ్రగ్స్ స్వాధీనం
పాట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నాటి నుంచి ఇప్పటివరకు ఓటర్లకు ఉచితంగా పంపిణీ చేసేందుకు తీసుకెళ్తున్న మద్యం, నగదు, డ్రగ్స్‌తోపాటు పలు వస్తువులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని దర్యాప్తు సంస్థల ఉన్నతాధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న వీటి విలువ రూ.64.13 కోట్లు ఉంటుందని వివరించారు. సోమవారం బిహార్ రాజధాని పాట్నాలో ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. అందులో రూ.23.41 కోట్ల విలువైన మద్యం, రూ.14 కోట్ల విలువైన వస్తువులు, రూ.16.88 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.4.19 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అలాగే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన 753 మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఇక 13,587 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశామన్నారు. అయితే 2016 నుంచి బిహార్‌లో మద్యపాన నిషేధం అమలవుతున్న సంగతి తెలిసిందే.
మరోవైపు ఈ ఎన్నికల్లో ఎక్కడ అవినీతి, ధన బలం అనేది లేకుండా చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కీలక శాఖలైన పోలీసులు, ఎక్సైజ్, ఆదాయపు పన్ను, కస్టమ్స్, రెవెన్యూ, ఇంటెలిజెన్స్, ఈడీ శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగేలా చూడాలని ఆయా శాఖల ఉన్నతాధికారులకు సీఈసీ స్పష్టం చేసింది. ఇంకోవైపు తమ పార్టీ అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధాన్ని ఎత్తి వేస్తామని జనసూరజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వేళ ఓటర్లకు స్పష్టమైన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అది కూడా తాము అధికారం చేపట్టిన గంట వ్యవధిలోనే ఈ మద్య పాన నిషేధాన్ని ఎత్తివేస్తామని ఆయన ప్రకటించారు.
Comments