ఆలయంలో.. బూజుపట్టిన ప్రసాదం
హైదరాబాద్: చంపాపేట డివిజన్ కర్మన్‌ఘాట్‌లోని హనుమాన్ ఆలయం లో భక్తులకు అందించే ప్రసాదంలో బూజు ప్రత్యక్షం కావడం కలకలం సృష్టించింది. హస్తినాపురం డివిజన్ కు చెందిన ఓ భక్తుడు మంగళవారం స్వామి వారిని దర్శించుకున్నాడు. అనంతరం స్వామి వారి పులిహోర ప్రసాదాన్ని కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి ప్రసాదం తినడానికి విప్ప చూడగా పులిహోర బూజు పట్టి ఉంది. దీంతో ఖంగుతిన్న ఆయన బూజు పట్టిన పులిహోరను ఫొటో తీసి ఆలయ ధర్మకర్తలకు పంపించారు. అనంతరం వారిని భక్తుడు ప్రశ్నించగా ఆలయ సిబ్బంది పొంతనలేని సమాధానాలు చెప్పారు. భక్తులకు నాణ్యమైన ప్రసాదం అందించాల్సిన బాధ్యత ఆలయ ఈఓ, సిబ్బందిపై ఉందని ధర్మకర్తలు పేర్కొన్నారు.
సంఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ధర్మకర్తలు దేవాదాయ, ధర్మాదాయశాఖ అధికారులను కోరుతున్నారు. ఈ విషయంపై ఆలయ ఈఓ లావణ్యను వివరణ కోరగా తాను మంగళవారం ప్రత్యేక సెలవులో ఉన్నట్లు పేర్కొన్నారు. పులిహోర బూజుపట్టి ఉన్న ఫొటోను కొందరు తనకు వాట్సాప్‌లో పంపించారని, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నట్లు ఆమె తెలిపారు.
Comments