బిహార్ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్.. పోటీ నుంచి జేఎమ్ఎం ఔట్
రాంచీ : బిహార్ రాజకీయాల్లో ఇవాళ కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎమ్ఎం) బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించింది. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్‌లతో సీట్ల కేటాయింపు చర్చలు విఫలమవడంతో ఈ చర్య తీసుకుంది. దీనిని రాజకీయ కుట్రగా ఆ పార్టీ పేర్కొంది. ఈ నిర్ణయం ఆర్జేడీ, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ కూటమిని ఇబ్బంది పెట్టేదిగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కాగా, హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎమ్ఎం, గత వారం చకై, ధమ్దహా, కటోరియా, మనిహారి, జమూయి, పిర్పైంటి వంటి ఆరు స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. కానీ, ఇవాళ (సోమవారం) పోటీ చేయకూడదని తీర్మానించింది. రాష్ట్ర పర్యాటక మంత్రి సుదీవ్యా కుమార్ మీడియాకు మాట్లాడుతూ.. ఆర్జేడీ, కాంగ్రెస్.. జేఎమ్ఎంకు సీట్లు కేటాయించకుండా రాజకీయ కుట్ర రచించాయని విమర్శించారు.
అంతేకాదు, ఝార్ఖండ్‌లోని మా కూటమిని మళ్లీ సమీక్షిస్తామని, ఈ అవమానానికి తగిన సమాధానం ఇస్తామని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు, వికాశీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) 15 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించింది. మహాఘట్ బంధన్(గ్రాండ్ అలయన్స్)లో వీఐపీ కీలక పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే.
Comments