• Oct 26, 2025
  • NPN Log

    విశాఖపట్నం : రాష్ట్రానికి ‘మొంథా’ తుఫాన్‌ ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుఫాన్‌ కోస్తాతో పాటు రాయలసీమలోని పలు జిల్లాలపై విరుచుకుపడనుంది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం పడమర దిశగా పయనించి శనివారం ఉదయానికి వాయుగుండంగా బలపడింది. శనివారం సాయంత్రానికి చెన్నైకి 890 కి.మీ. తూర్పు ఆగ్నేయంగా, విశాఖపట్నానికి 920 కి.మీ., కాకినాడకు 920 కి.మీ. ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఇది ఆదివారం ఉదయానికి నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి తీవ్ర వాయుగుండంగా, ఆ తరువాత మరింత బలపడి సోమవారం ఉదయానికి తుఫాన్‌గా బలపడుతుంది. దీనికి థాయ్‌లాండ్‌ దేశం సూచించిన ‘మొంథా’ అని పేరు పెట్టనున్నారు. ఇది 28 సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ వద్ద (ఒక అంచనా మేరకు కాకినాడ-తుని మధ్య) తీరం దాటుతుందని ఐఎండీ తెలిపింది. ఈ నేపథ్యంలో 28న ఉదయం కోస్తాలో తీరం వెంబడి గంటకు 60నుంచి 70 కి.మీ. వేగంతో గాలులు వీయనున్నాయి.

    తుఫాన్‌ తీరం దాటే సమయంలో గాలులు 90 నుంచి 110 కి.మీ. వేగంతో వీస్తాయి. తుఫాన్‌ ప్రభావంతో భారీ నుంచి అతిభారీ, అక్కడక్కడా కుంభవృష్టిగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో 27 నుంచి 29 వరకూ పలు జిల్లాలకు ఐఎండీ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ఈ నెల 29 వరకు కోస్తాలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది. శనివారం విశాఖ నుంచి కృష్ణపట్నం వరకు ఓడరేవుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక జారీచేశారు.


     

    బీచ్‌లకు పర్యాటకుల ప్రవేశంపై నిషేధం

    ఆదివారం కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు, దక్షిణ కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని, సోమవారం నుంచి వర్షాలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్‌ ప్రభావంతో సముద్రం అలజడిగా మారి, అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున సముద్ర తీరాలు, నదుల్లో చేపలు పట్టడం, అన్ని బోటింగ్‌ కార్యకలాపాలను నిలుపుదల చేసి, బీచ్‌లకు పర్యాటకుల ప్రవేశాన్ని నిషేధించాలని కోస్తా జిల్లాల కలెక్టర్లకు సూచించినట్లు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఎండీ ప్రఖర్‌ జైన్‌ తెలిపారు.

    కాకినాడ పోర్టు అప్రమత్తం

    తుఫాన్‌ ముప్పు ఎదుర్కొనేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని కలెక్టరేట్‌లలో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేశారు. అదనపు కరెంటు స్తంభాలు, సిబ్బంది, జనరేటర్లను సిద్ధం చేస్తున్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌తో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ టెలీకాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు కాకినాడ పోర్టుల్లో అన్ని కార్గో ఎగుమతి, దిగుమతులు నిలిపివేయనున్నారు. ఇక్కడ లంగరు వేసిన ఓడలను సోమవారం మధ్యాహ్నం నుంచి సముద్రంలోకి తరలించనున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).