పాక్ సరిహద్దులో ఎక్స్ త్రిశూల్
న్యూఢిల్లీ : భారత త్రివిధ దళాలు భారీఎత్తున సంయుక్త విన్యాసాలకు సిద్ధమవుతున్నాయి. పశ్చిమాన పాకిస్థాన్ సరిహద్దులో సర్ క్రీక్ సమీపాన ఈ నెల 30 నుంచి నవంబరు 10వ తేదీ వరకు ‘ఎక్స్ త్రిశూల్’ పేరిట వీటిని నిర్వహించనున్నాయి. వీటికోసం వైమానిక దళం 28 వేల అడుగుల ఎత్తువరకు గగనతల ఆంక్షలు విధించింది. పైగా యుద్ధం సహా ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా సిద్ధంగా ఉండాలని ఎయిర్‌ఫోర్స్ తన అధికారులు, సిబ్బంది మొత్తానికీ ‘నోటీస్ టు ఎయిర్‌మెన్ (నోటమ్)’ జారీచేసింది. ఇటీవలి కాలంలో ఇంత పెద్దఎత్తున సంయుక్త విన్యాసాలు జరుపలేదు. పాకిస్థాన్‌తో ఇటీవలి కాలంలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ చేపట్టి విజయం సాధించాక ‘ఎక్స్ త్రిశూల్’కు త్రివిధ బలగాలు సిద్ధం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సర్ క్రీక్ వద్ద భారత సైన్యం ‘ఎక్స్ త్రిశూల్’ విన్యాసాలు తలపెట్టడం, వైమానిక సిబ్బందికి ‘నోటమ్’ కూడా జారీచేయడంతో పాకిస్థాన్ భయాందోళనలకు గురవుతోంది. తన దేశ సెంట్రల్, దక్షిణ ప్రాంతాల్లో గగనతలంలో విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. తన సైన్యసిబ్బందికి తాను కూడా నోటమ్ జారీచేసింది. కాగా, భారత నౌకాదళం అమ్ములపొదిలోకి అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌక ‘మహే’వచ్చిచేరింది. 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారవడం ‘మహే’ ప్రత్యేకత. టార్పిడోలు, బహుళ వినియోగ జలాంతర్గామి విధ్వంసక క్షిపణులు, అధునాతన రాడార్లు, సోనార్లతో శత్రు లక్ష్యాలను ఇది తేలిగ్గా ఛేదించగలదు.









Comments