మత్తు ఇచ్చి భార్యను చంపిన వైద్యుడు
బెంగళూరు : అనారోగ్యాన్ని దాచి పెళ్లి చేశారన్న కోపంతో రగిలిపోయిన ఓ వైద్యుడు తన భార్యకు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి చంపేశాడు. బెంగళూరు నగరంలోని విక్టోరియా ఆసుపత్రిలో చర్మరోగ నిపుణురాలిగా సేవలందించే డాక్టర్ కృత్తికారెడ్డికి, జనరల్ సర్జన్ మహేంద్ర రెడ్డితో 2024, మే 26న వివాహం జరిగింది. కొంతకాలానికి ఆమెకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. అజీర్తి, గ్యాస్ట్రిక్, లో షుగర్‌తో బాధపడేవారు. పెళ్లికి ముందే ఆమెకు ఈ సమస్యలున్నాయని, వాటిని దాచిపెట్టి పెళ్లి చేశారని మహేంద్రరెడ్డి అనుమానించారు. ఆరు నెలల క్రితం ఆమెకు ఆరోగ్య సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 21న నగరంలోని తన పుట్టింటికి వెళ్లారు. కడుపునొప్పికంటూ ఆమెకు అక్కడే మహేంద్రరెడ్డి ఐవీ ఇంజెక్షన్ ఇచ్చారు. మరుసటి రోజు అక్కడే విశ్రాంతి తీసుకోవాలని సూచించి, ఆ రాత్రికి మరో ఐవీ డోస్ ఇచ్చారు. 23న కృత్తిక తన భర్తకు వాట్స్‌పలో తనకు నొప్పి ఎక్కువగా ఉందని మెసేజ్ పెట్టారు. ఆ రోజు రాత్రికి ఇంటికి వచ్చిన మహేంద్ర... మరోసారి ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ మరుసటి రోజు... అంటే 24వ తేదీ ఉదయం స్పృహ కోల్పోయిన ఆమెను కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు, అప్పటికే ఆమె మృతి చెందిందని తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని, పోస్టుమార్టం అవసరం లేదని మహేంద్రరెడ్డి వారించే ప్రయత్నం చేశారు. రేడియాలజిస్టుగా పనిచేస్తున్న కృత్తిక అక్క డాక్టర్ నిఖితరెడ్డి చెల్లి మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షించారు. అది సహజ మరణం కాదని, అనస్థీషియా హై డోస్ కారణంగా మృతి చెందారని నివేదిక వచ్చింది. వైద్యం పేరిట తన భార్యను డాక్టర్ మహేంద్రరెడ్డి కుట్రపూరితంగా హత్య చేసినట్లు తేలింది. పోలీసులు ఆయనను బుధవారం అరెస్టు చేశారు. హత్య జరిగిన ఆరు నెలల తర్వాత వాస్తవం వెలుగులోకి వచ్చింది.
Comments