మ్యాచ్‌కు ముందు రోజు రాత్రంతా రోదనే.. వరుణ్ చక్రవర్తి ఆసక్తికర కామెంట్స్
ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ విజయాల్లో టీమిండియాకు కీలకంగా నిలిచిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. అయితే, కీలక మ్యాచ్‌లకు అతడు ఎలా సిద్ధమవుతాడో తాజాగా చెప్పుకొచ్చాడు. ‘కొత్త మ్యాచ్‌లకు ముందు నేను చాలా ఇబ్బంది పడతాను. టోర్నీ ముందు రోజు రాత్రంతా రోదిస్తా. రేపేమవుతుందో, ఎలా గడుస్తుందో అన్న ఆలోచనలు నన్ను కుదిపేస్తాయి’ అని చెప్పుకొచ్చాడు. ప్రతి టోర్నీకి ముందు ఇలాగే జరుగుతుందని అన్నాడు. క్రికెట్ టాక్ షో ‘బ్రేక్‌ఫాస్ట్ వింత్ ఛాంపియన్స్’లో ఈ కామెంట్స్ చేశాడు.
ఇటీవల కాలంలో టాప్ బౌలర్‌గా కూడా వరుణ్ చక్రవర్తి పేరు తెచ్చుకున్నాడు. ఈ గుర్తింపుపై కూడా అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నేను ఇప్పుడు చెస్‌ను ఫాలో అవుతున్నాను. ఇటీవల గుకేశ్ వరల్డ్ చాంపియన్ షిప్ గెలిచినప్పుడు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తాను వరల్డ్ ఛాంపియన్ అయినా మాగ్నస్ కార్ల్‌సన్ నెం.1 ప్లేయర్ అని ప్రతి ఒక్కరు భావిస్తారని అన్నాడు. నేనూ అంతే.. ఇప్పుడు నేను నెం.1గా ఉండొచ్చు కానీ బుమ్రా టాప్ ప్లేయర్ అని ప్రతి ఒక్కరికీ తెలుసు’ అని వ్యాఖ్యానించాడు.
ఇటీవల జట్టు విజయాల్లో వరుణ చక్రవర్తి కీలక పాత్ర పోషిస్తూ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి వచ్చాడు. దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో కీలక సమయంలో పాక్ ప్లేయర్లను ఔట్ చేసి ప్రత్యర్థి పతనానికి బాటలు పరిచాడు. వరుణ్ రెండు వికెట్ల తీసుకున్నాక పాక్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. 113/1 దశ నుంచి 146 పరుగులకే ఆలౌట్ అయిపోయింది.
ఇక మైదానంలో దూకుడు కనబరచడమే కాకుండా సోషల్ మీడియాలో తన మాటలు, కామెంట్స్‌తోనూ వరుణ చక్రవర్తి దుమ్మురేపుతుంటాడు. ఆసియా కప్‌ను పీసీబీ చీఫ్ తీసుకెళ్లిపోయినా డోన్ట్ కేర్ అంటూ అతడు పెట్టిన పోస్టు తెగ వైరల్ అయ్యింది. మ్యాచ్ అనంతరం అతడు టీకప్పు పట్టుకుని ఓ ఫొటో దిగి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ‘ప్రపంచం అంతా ఒకవైపు, నా దేశం ఒక వైపు.. జైహింద్’ అంటూ అతడు పెట్టిన పోస్టు అప్పట్లో తెగ వైరల్ అయ్యింది.
Comments