యూరియాపై వైసీపీ తప్పుడు ప్రచారం
అనంతపురం : ‘యూరియాపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. రైతులు ఆందోళన చెందవద్దు. అవసరాల మేరకు యూరియా అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి’ అని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. బుధవారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. ‘వైసీపీ పాలనలో యూరియా ఇవ్వకుండా రైతులకు నరకం చూపించారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 81వేల హెక్టార్లలో అధికంగా పంటలు వేశారు. వ్యవసాయంలో యూరియా వాడకాన్ని తగ్గించాలని, దానివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కేంద్రం తెలిపింది. వైసీపీ నాయకులు చేస్తున్న అవాస్తవ ప్రచారంతో భయపడిన రైతాంగం భవిష్యత్తులో యూరియా దొరకదన్న భయంతో ఖరీ్‌ఫతోపాటు, రబీకి కూడా యూరియా తీసుకునేందుకు ఎగబడుతున్నారు. రైతుల అవసరాల మేరకు ప్రభుత్వం యూరియాను సిద్ధంగా ఉంచుతోంది. ఎప్పటికప్పుడు సరఫరా చేస్తాం. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మాట్లాడింది. త్వరలో 50 వేల టన్నులు యూరియా వస్తుంది. రబీకి సైతం మరో లక్ష టన్నుల యూరియా వస్తుంది. పంజాబ్‌లో యూరియా ఎక్కువగా వాడటం వల్ల చాలామంది క్యాన్సర్ బారిన పడ్డారు. అందుకే శాస్త్రవేత్తలు కూడా యూరియా వాడకాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు’ అని మంత్రి విజ్ఞప్తి చేశారు.
Comments