16 నెలల్లో ఏపీకి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: నారా లోకేశ్
అమరావతి : యువతకు ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ పునరుద్ఘాటించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. ఈ 16 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. సోమవారం ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్ విలేకర్లతో మాట్లాడుతూ.. ఆర్సెల్లార్ మిట్టల్ రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతుందని వివరించారు. అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దూసుకుపోతుందని స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణే తమ ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో విజన్ ఉన్న నాయకత్వం ఉందని చెప్పారు.
విశాఖపట్నం వేదికగా నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు 300 మంది పారిశ్రామికవేత్తలు తరలి రానున్నారన్నారు. ఈ సదస్సులో 410 ఒప్పందాలపై సంతకాలు చేయబోతున్నట్లు మంత్రి నారా లోకేశ్ వివరించారు. ఈ భాగస్వామ్య సదస్సుకు కేవలం కంపెనీలను ఆహ్వానించడమే కాదని.. అక్కడ ఎకో సిస్టం క్రియేట్ చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. ఏపీకి నవంబర్ మాసంలో పలు ప్రాజెక్టులు రాబోతున్నాయని చెప్పారు. ప్రోత్సాహకాల అంశంలో ఏపీతో పొరుగు రాష్ట్రాలు పోటీ పడవచ్చునని పేర్కొన్నారు. దేశ ఎఫ్‌డీఐ చరిత్రలో అతిపెద్ద పెట్టుబడి గూగుల్ పెట్టబోతుందని ఆయన వివరించారు. స్వదేశీ పెట్టుబడుల సాధనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని గుర్తు చేశారు. నెల్లూరులో బీపీసీఎల్ సంస్థ రూ. లక్ష కోట్ల పెట్టుబడి పెడుతుందన్నారు.
నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నం వేదికగా సీఐఐ భాగస్వామ్య సదస్సును చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు వివిధ దేశాల నుంచి పలు కంపెనీ ప్రతినిధులు, వివిధ సంస్థల సీఈవోలతోపాటు ఉన్నతాధికారుల బృందాలు భారీగా తరలిరానున్నాయి. అందుకు తగిన ఏర్పాట్లను ఇప్పటికే ప్రభుత్వం చేపట్టింది. ఈ భాగస్వామ్య సదస్సు విజయవంతం చేసేందుకు ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో ముందుకు వెళ్తుంది.
మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేశ్, పి. నారాయణ వేర్వేరుగా వివిధ దేశాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా దేశాల ఉన్నతాధికారులు, వివిధ సంస్థల సీఈవోలతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. ఆ క్రమంలో ఏపీ రాజధాని అమరావతితోపాటు రాష్ట్రాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వారికి సోదాహరణగా వివరించారు. అలాగే నవంబర్‌లో నిర్వహించే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని వారిని కోరారు. ఈ నేపథ్యంలో ఈ సదస్సుకు భారీగా పలు దేశాల ప్రతినిధులు తరలి రానున్నారు.
 
                     
                              
  









 
 
Comments