• Nov 04, 2025
  • NPN Log

    అమరావతి : జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం స్కామ్‌ దర్యాప్తులో మరో కీలక అడుగు పడింది. కమీషన్ల రూపంలో పోగేసుకున్న నల్లధనాన్ని ‘వైట్‌’ చేసేందుకు వాడిన మనీ లాండరింగ్‌ మూలాల లింకును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) గుర్తించింది. అక్రమ చలామణీలో చెయ్యి తిరిగిన ముంబై వ్యాపారి అనిల్‌ చోఖ్రా నుంచి కీలక వివరాలు రాబట్టింది. జగన్‌ చుట్టూ ఉండే ఎంపీ మిథున్‌ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డి, భారతీ సిమెంట్స్‌ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్పలకు బెయిలు రావడంతో... కేసు అక్కడితో ఆగిపోయిందని ఊపిరి పీల్చుకుంటున్న ‘అంతిమ లబ్ధిదారు’కు చిక్కులు తప్పవని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... రెండు రోజుల క్రితం విజయవాడ నుంచి ముంబై వెళ్లిన ప్రత్యేక బృందాలు అక్కడ అనిల్‌ చోఖ్రాను ప్రశ్నించాయి. అనిల్‌మనీలాండరింగ్‌ కేసుల్లో ఇప్పటికే రెండుసార్లు అరెస్టయ్యారు. డొల్ల కంపెనీలు సృష్టించి నల్ల డబ్బును తెలుపు చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. బినామీల పేరుతో క్రిపటి ఎంటర్‌ప్రైజెస్‌, నైస్‌నా మల్టీ వెంచర్స్‌, ట్రిఫర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, విక్సో ఎంటర్‌ప్రైజెస్‌ అంటూ నాలుగు డొల్ల కంపెనీలు సృష్టించారు. ఎటువంటి వ్యాపారాలు చేయకుండానే వేల కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహించారు. వీటి ద్వారా ఆయన మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రెండు వేర్వేరు కేసుల్లో 2017లో, 2021లో అరెస్టు చేసి జైలుకు పంపింది. బెయిలుపై బయటికి వచ్చిన అనిల్‌ చోఖ్రాను గత ప్రభుత్వ ముఖ్యులు సంప్రదించారు. ఏపీలో నిరుపేదల రక్తాన్ని పీల్చి మరీ దోచుకున్న మద్యం డబ్బులను వైట్‌గా మార్చేందుకు సహకరించాలని కోరారు. ఆయన తన అనుచరుల పేరుతో ఉన్న డొల్ల కంపెనీల జాబితా ఇచ్చారు.


    అందులో నాలుగు కంపెనీల ఖాతాలు వాడుకుని వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరిపారు. ఇలా చేసినందుకు కమీషన్‌ పుచ్చుకున్నారు. మద్యం ముడుపులు మార్పు చేసి గత ప్రభుత్వంలో ముఖ్యుల వాటాను వైట్‌ చేసి చెల్లించేవారు. కేసు దర్యాప్తులో భాగంగా ‘సిట్‌’ అధికారులు అనిల్‌ చోఖ్రా కార్యకలాపాలు, మద్యం ముడుపులను మార్చడంలో ఆయన పాత్రపై కీలక ఆధారాలు సేకరించారు. ఎవరెవరితో, ఎప్పుడెప్పుడు సంప్రదింపులు జరిపారనే సాంకేతిక ఆధారాలను గుర్తించారు. ముంబైకి వెళ్లి అనిల్‌ చోఖ్రా ముందు సంబంధిత ఆధారాలను పెట్టారు. దీంతో ఆయనకు నోరు తెరవక తప్పలేదు. జగన్‌ హయాంలో వందల కోట్ల రూపాయలను అక్రమంగా చలామణీ చేసినట్లు అంగీకరించారు. దీంతో లిక్కర్‌ స్కామ్‌లో మరో నిందితుడు చేరాడు. అనిల్‌ చోఖ్రాను 49వ నిందితుడిగా చేరుస్తూ సిట్‌ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఇప్పటికే 48మంది నిందితులున్న ఈ కేసులో 12మందికి పైగా అరెస్టయ్యారు. కొందరు బెయిలుపై విడుదల కాగా రాజ్‌ కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, వెంకటేశ్‌ నాయుడు తదితరులు జైల్లోనే ఉన్నారు. అనిల్‌ చోఖ్రాను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).