మోదీ దీపావళి వేడుకలు.. ఐఎన్ఎస్ విక్రాంత్ శక్తి, సామర్థ్యాలు ఇవే!
పాకిస్తాన్‌ను ఐఎన్ఎస్ విక్రాంత్ మోకాళ్లపై కూర్చోబెట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దీపావళి వేడుకలను ఐఎన్ఎస్ విక్రాంత్‌లో జరుపుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. పాక్ నౌకలు అడుగు ముందుకు వేయాలంటేనే భయపడిపోయాయని అన్నారు. పహల్గామ్‌లో జరిగిన పాక్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రభావంతంగా పనిచేసిందని ప్రశంసించారు. గోవా తీరంలో ఐఎన్ఎస్ విక్రాంత్‌లో నేవీ దళంతో కలిసి ఆయన దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడారు. దీంతో ఐఎన్ఎస్ విక్రాంత్ గురించిన మరింత సమాచారం నెటిజన్లు వెతుకుతున్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రత్యేకతలు, సామర్థ్యం, యుద్ధ నైపుణ్యంపై ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇండియా స్వదేశీయంగా నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ 2022లో నౌకాదళంలో ప్రవేశపెట్టబడింది. ఇది దేశ సముద్ర రక్షణ సామర్థ్యాన్ని మరింత బలపరచడానికి నిర్మించారు. హైలెవెల్ టెక్నాలజీతో నిర్మించిన ఈ యుద్ధ నౌకను 'సిటీ ఆన్ ది మూవ్' అని కూడా పిలుస్తారు. ఈ నౌకకు 'విక్రాంత్' అనే పేరు, దానికి ముందు ఉన్న నౌకను గౌరవించడానికి, ఆ నౌక శక్తి సామర్థ్యాలను తెలియజేయడానికి పేరు పెట్టారు. ఆ నౌక 1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయానికి కీలక పాత్ర పోషించింది.
దేశంలో ఇప్పటివరకు నిర్మించిన అతి పెద్ద యుద్ధ నౌకగా ఐఎన్‌ఎస్ విక్రాంత్ నిలిచింది. ఈ నౌక పొడవు 262 మీటర్లు, వెడల్పు 62 మీటర్లు. ఇది రష్యా ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది. ఇది ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య తర్వాత భారత నౌకాదళంలో రెండో విమాన వాహక నౌక. ఈ నౌక విస్తీర్ణం సులభంగా అర్థం చేసుకోవాలంటే.. ఇది రెండు ఫుట్‌బాల్ మైదానాల పొడవుతో, 18 అంతస్తుల ఎత్తుతో సమానంగా ఉంటుంది. నౌకలోని హ్యాంగర్ రెండు ఒలింపిక్ పరిమాణపు స్విమింగ్ ఫూల్ అంత పెద్దగా ఉంటుంది.
ఈ యుద్ధనౌకలో 30 విమానాలు (ఉదా: మిగ్-29K ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు) ఉండే అంత కెపాసిటీ ఉంది. దాదాపు 1,600 మంది సిబ్బందికి వసతి ఉంటుంది. దీన్ని నిర్మించడానికి పదేళ్లకు పైగా సమయం పట్టింది. ఇందులో 16 పడకల ఆసుపత్రి, 250 ట్యాంకర్లు ఇంధనం, అలాగే 2,400 కంపార్ట్‌మెంట్లు ఉండటం విశేషం. గతేడాది చివర్లో దక్షిణ నౌకాదళ కమాండ్ ప్రధాన అధికారి ప్రకటించిన ప్రకారం.. ఐఎన్‌ఎస్ విక్రాంత్ తన తుది ఆపరేషనల్ క్లియరెన్స్ పూర్తి చేసి, పూర్తిస్థాయి ఆపరేషనల్ ను విజయవంతం చేసింది. ప్రస్తుతం ఇది పశ్చిమ నౌకాదళ కమాండ్ పరిధిలో ఉంది. అంతే కాకుండా అన్ని నౌకా కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉంది.
Comments