సమంత ‘పవర్ మార్నింగ్’ సీక్రెట్
ప్రముఖ నటి సమంత ... ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యమిస్తారో అందరికీ తెలిసిందే. ఆరోగ్యం, వ్యాయామాలకు సంబంధించి ఎన్నో అంశాలను ఆమె అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ‘పవర్ మార్నింగ్’ పేరిట ఓ స్పెషల్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు సమంత. అందులో పలు ఆసక్తికరమైన అంశాలు ప్రస్తావించారామె. ఉదయం పూట మనం చేసే మంచి పనులే ఆక్సిటోసిన్లా పనిచేసి రోజంతా మూడ్‌ను తాజాగా ఉంచుతాయంటున్నారు సమంత. ఒక్కోసారి ఉదయం నిద్రలేవగానే ముఖం ఉబ్బినట్లుండడం, మొటిమలు కనిపించడం, బెల్లీ ఫ్యాట్ పెరిగినట్లుండడం లాంటివి చికాకు కలిగించేవన్నారు. దీంతో వీటినుంచి తప్పించుకొని రోజంతా సంతోషంగా గడపడానికి రకరకాల మార్నింగ్ రొటీన్ విధానాలు అనుసరించాల్సి వచ్చిందన్నారు. చివరికి ఓ సింపుల్ విధానం మంచి ఫలితాన్నివ్వడంతో దానికి ‘పవర్ మార్నింగ్’ అని పేరు పెట్టానంటున్నారు సమంత. దీనిలో భాగంగా ఉదయం లేవగానే చేయాల్సిన పనుల గురించి ఇలా చెప్పుకొచ్చారామె...
నిద్ర లేవగానే గంట వరకు ఫోన్ ముట్టుకోకూడదు. కళ్లు తెరవగానే వర్క్‌కు సంబంధించిన వాట్సప్ మెసేజ్‌లు, ఈ మెయిల్స్ చూస్తే ఒత్తిడి రెట్టింపవుతుంది. దీని ప్రభావం ఆ రోజు చేయాల్సిన పనులపై పడుతుంది. రోజంతా చికాకుగా అనిపిస్తుంది. కాబట్టి ఫోన్ చూడకుండా ఉంటే మనసు ప్రశాంతంగా మారుతుంది. మెదడు డోపమైన్ మోడ్‌లోకి వెళుతుంది. రోజును కొత్తగా ఆహ్వానిస్తున్నామన్న భావన కల్గుతుంది.
నిద్ర లేవగానే అయిదు నిమిషాలపాటు ధ్యానం చేయాలి. గాఢంగా ఊపిరిని లోనికి తీసుకుని మెల్లగా వదలాలి. దీనివల్ల మెదడు నుంచి కడుపు వరకు ఉండే వేగస్ నాడి ఉత్తేజితమవుతుంది. ఫలితంగా శ్వాసక్రియ, హృదయ స్పందన, జీర్ణక్రియ, మానసిక స్థితి మెరుగుపడతాయి. అనవసరమైన కొవ్వులు కరిగిపోతాయి. ఒత్తిడి తగ్గి మెదడు చురుకుగా పని చేస్తుంది.
ఉదయాన్నే కొద్దిసేపు శరీరానికి సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. కనీసం పది నిమిషాలు ముఖంపై ఎండ పడేలా సూర్యునికి ఎదురుగా నిలబడాలి.
ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో కొద్దిగా పసుపు, నిమ్మరసం, యాపిల్ సైడర్ వెనిగర్, మిరియాల పొడి, ఒక చుక్క ఆలివ్ ఆయిల్ కలుపుకుని తాగాలి.
పోషకాలతో కూడిన అల్పాహారం తీసుకోవాలి. అందులో తాజా పండ్లు, కూరగాయలు, కోడిగుడ్లు, డ్రైఫ్రూట్స్ చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. తీపి పదార్థాలు, ప్రాసెస్డ్ స్నాక్ ఐటెమ్స్ తినకూడదు.
అల్పాహారం తరువాత ఓ కప్పు బ్లాక్ కాఫీ లేదా గ్రీన్ టీ తాగాలి. దీనివల్ల ఉత్సాహంగా అనిపిస్తుంది.
ఉదయం పదకొండు గంటలలోపు వర్కౌట్లు పూర్తిచేయాలి.
ఆ రోజు ఏ పనులు పూర్తిచేయాలో స్పష్టంగా ఓ బుక్‌లో రాసుకోవాలి. దీనివల్ల సమయం వృథా కాకుండా ఉంటుంది. మెదడుకు అతిగా ఆలోచించాల్సిన శ్రమ తగ్గుతుంది.
ఈ పవర్ మార్నింగ్ రొటీన్‌ను కనీసం 21 రోజులు పాటిస్తే నెర్వస్ సిస్టమ్ మెరుగుపడుతుంది. ఇన్ఫ్లమేషన్ సమస్యలు తగ్గుతాయి.
ప్రయత్నిద్దాం రండి
చిన్న చిన్న మార్పులే గొప్ప ప్రభావాన్ని చూపుతాయనేది నిర్వివాదాంశం. అత్యంత సాధారణంగా అనిపించే ఈ అలవాట్లు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంచుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈ పవర్ మార్నింగ్ విధానాన్ని ఆచరణయోగ్యమైనదిగా భావించవచ్చు. ఇక ఆలస్యమెందుకు..? రేపటి నుంచే ప్రారంభిద్దాం..!









Comments