• Jul 26, 2026
  • NPN Log

    బిష్కెక్ (కిర్గిజిస్తాన్) : వాషింగ్టన్ తెస్తున్న ఒత్తిడి, బెదిరింపు రాజకీయాలకు ఇరాన్ ఎప్పటికీ తలొగ్గదని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. 'షాంఘై సహకార సంస్థ' విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరాన్-అమెరికా మధ్య చర్చలు జరగకపోవడానికి మార్గాలు లేకపోవడం కారణం కాదని, అమెరికా నిరంతరం ఉపయోగిస్తున్న 'బెదిరింపులు, బలవంతపు ఒత్తిళ్ల ధోరణి' మాత్రమే ప్రధాన సమస్య అని అరాఘ్చీ విమర్శించారు. 'ఇరాన్ ప్రజల ప్రయోజనాలను, హోర్ముజ్ జలసంధిలో  దేశ రక్షణను కాపాడుకోవడమే మా ప్రాథమిక సూత్రం. బెదిరింపులకు మేము భయపడేది లేదు' అని ఆయన తేల్చిచెప్పారు.

    SCO ఒక ప్రగతిశీల సంస్థ అని పేర్కొంటూ.. అంతర్జాతీయ సంబంధాలపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న అమెరికా, పాశ్చాత్య దేశాల ఏకపక్ష వైఖరిని సభ్య దేశాలు కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ లతో పాటు పాకిస్తాన్, ఈజిప్ట్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్ మంత్రులతో అరాఘ్చీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 

    ఒకవైపు దౌత్యపరమైన ప్రకటనలు వస్తుండగానే, మరొకవైపు అమెరికా-ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. ఇరాన్ మిలిటరీ లక్ష్యాలపై అమెరికా దళాలు వైమానిక దాడులు పూర్తి చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించింది. కాగా, బందర్ అబ్బాస్ ప్రాంతంలో జరిగిన ఈ దాడుల్లో కనీసం ఇద్దరు గాయపడ్డారు. అలాగే ఇరాన్ గ్యాస్‌ను తరలిస్తోందన్న అనుమానంతో ఒమన్ సముద్రంలో ప్రవేశిస్తున్న ఒక LPG ట్యాంకర్‌పై అమెరికా రెండు మిస్సైళ్లతో దాడి చేసింది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement