ఇరాన్‌పై భారీ దాడులు ఎందుకు ఆగాయి.. ట్రంప్ అందుకే వెనక్కి తగ్గారా..?
ఇరాన్‌పై మరింత విస్తృత స్థాయిలో సైనిక దాడులు చేపట్టాలన్న ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా నిలిపివేసినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అమెరికా వైమానిక రక్షణ వ్యవస్థలకు అవసరమైన క్షిపణుల నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయని సీనియర్ సైనిక అధికారులు హెచ్చరించడంతోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇరాన్‌పై యుద్ధాన్ని మరింత తీవ్రం చేయడం వల్ల క్షిపణుల నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోతాయని ట్రంప్‌నకు అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కేన్ సహా పలువురు సైనికాధికారులు వివరించినట్లు తెలుస్తోంది. దీంతో తక్షణమే పెద్ద ఎత్తున దాడులు మొదలుపెట్టకుండా వేచి చూడాలని నిర్ణయించినట్లు సమాచారం.
ప్రస్తుత యుద్ధంలో ఇరాన్ భారీ సంఖ్యలో డ్రోన్‌లను వినియోగిస్తోంది. ఒక్కో డ్రోన్ ధర కేవలం 20 వేల నుంచి 50 వేల డాలర్లలోపే ఉంటోంది. ఆ డ్రోన్‌లను ఎదుర్కోవడానికి అమెరికా వినియోగిస్తున్న ఒక్కో ఇంటర్‌సెప్టర్ క్షిపణి ధర మాత్రం 15 లక్షల డాలర్లకు పైనే ఉంటుంది. దీంతో అమెరికా భారీగా నష్టపోతోంది.
ఇప్పటికే అమెరికా పశ్చిమాసియాలోని తన సైనిక స్థావరాలు, యుద్ధ నౌకలు, మిత్రదేశాలను రక్షించేందుకు భారీ సంఖ్యలో వైమానిక రక్షణ క్షిపణులను వినియోగించింది. ఈ నేపథ్యంలో ఆ ఆయుధాలకు కొరత ఏర్పడింది. దీంతోనే విస్తృత దాడుల విషయంలో ట్రంప్ వెనకడుగు వేసినట్టు సమాచారం.
కాగా, ఇరాన్‌పై దాడులను పూర్తిగా విరమించలేదని, పరిస్థితులను బట్టి మళ్లీ దాడులను విస్తరించే అవకాశం ఉందని అమెరికా సైనికాధికారులు చెబుతున్నారు. అలాగే దౌత్యపరమైన చర్చలకు అవకాశం కల్పించేందుకు కూడా ఈ విరామాన్ని ఉపయోగించాలనే ఆలోచనలో ట్రంప్ ప్రభుత్వం ఉన్నట్లు పేర్కొన్నారు.








Comments