• Jul 26, 2026
  • NPN Log

    మనీలా (ఫిలిప్పీన్స్): ఆసియాన్ రీజినల్ ఫోరం మంత్రుల సమావేశం వేదికగా పాకిస్థాన్ చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ సమావేశంలో పాక్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్.. కశ్మీర్ అంశం, సింధు జలాల ఒప్పందం  నిలిపివేతపై భారత్‌ను లక్ష్యంగా చేసుకుని కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ మంత్రి వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తిప్పికొట్టారు. అంతర్జాతీయ వేదికలను పాకిస్థాన్ అసత్య ప్రచారం, దుష్ప్రచారానికి వాడుకుంటోందని ఆయన మండిపడ్డారు.

    ఆసియాన్ రీజినల్ ఫోరంలో భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సమావేశానికి హాజరుకాగా.. అనంతరం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందించారు. పాకిస్థాన్ మరోసారి అంతర్జాతీయ వేదికను దుర్వినియోగం చేస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. సరిహద్దు దాటి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్.. తన పాత్ర నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్, లద్దాక్ కేంద్ర పాలిత ప్రాంతాలు ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగంగానే ఉంటాయని జైశ్వాల్ స్పష్టం చేశారు. ఈ అంశంపై వ్యాఖ్యానించే హక్కు పాకిస్థాన్‌కు లేదని తేల్చిచెప్పారు. సింధు జలాల ఒప్పందంపై భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు.

     

    పహల్గామ్‌లో జరిగిన ఘోర ఉగ్రదాడితో పాటు, సరిహద్దు దాటి ఉగ్రవాదానికి పాక్ ప్రోత్సహిస్తున్న కారణంగానే ఒప్పందాన్ని నిలిపివేశామని జైశ్వాల్ తెలిపారు. పాక్ శాశ్వతంగా ఉగ్రవాదానికి మద్దతు నిలిపివేసే వరకు ఒప్పందం అమలు నిలిపివేత కొనసాగుతుందని స్పష్టం చేశారు. 'ఫిత్నా అల్-హిందుస్థాన్' వంటి మతపరమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ అధికారిక స్థాయిలో పాక్ దుష్ప్రచారం చేయడాన్నీ ఆయన తీవ్రంగా ఖండించారు. దేశంలో అంతర్గత సంక్షోభాలు, ప్రపంచ ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తూ తన పాత్ర నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఇతర దేశాలపై వేలెత్తి చూపడం మానేసి, ముందుగా తన భూభాగంలో ఉన్న ఉగ్రవాద మౌలిక వసతులను పూర్తిగా నిర్మూలించాలని పాక్‌కు జైశ్వాల్ సూచించారు.

     

    దార్ ఏమన్నారంటే..

    దక్షిణాసియాలో ప్రాంతీయ అస్థిరతకు కశ్మీర్ సమస్యే ప్రధాన కారణమని ఏఆర్‌ఎఫ్ సమావేశంలో పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ అన్నారు. ఐక్యరాజ్యసమితి చార్టర్, భద్రతా మండలి తీర్మానాలు, కశ్మీరీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు అంతర్జాతీయ సమాజం మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని ఆయన విమర్శించారు. భారత్ ఏకపక్షంగా ఒప్పందాన్ని నిలిపివేసిందని ఆరోపించారు. నీటిని ఆయుధంగా ఉపయోగిస్తూ అంతర్జాతీయ నిబంధనలను భారత్ ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ఈ అంశాన్ని చర్చల ద్వారా, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా పరిష్కరించాలని దార్ చెప్పుకొచ్చారు.

    ఉగ్రవాదానికి మూల్యం తప్పదు: జైశంకర్..

    ఉగ్రవాదంపై విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ భారత్ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. ఏఆర్‌ఎఫ్ సమావేశంలో ప్రసంగించిన ఆయన ఉగ్రవాదంపై 'జీరో టాలరెన్స్' విధానాన్ని ప్రపంచ దేశాలు అనుసరించాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాద చర్యలకు తప్పనిసరిగా పరిణామాలు ఉంటాయని, ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement