• Jul 26, 2026
  • NPN Log

    2027 వన్డే ప్రపంచకప్‌ కోసం భారత జట్టు సన్నద్ధమవుతున్న వేళ.. హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ అమలు చేస్తున్న సెలక్షన్ విధానంపై టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విమర్శలు గుప్పించాడు. ప్రస్తుతం జట్టులో పూర్తిస్థాయి ఆల్‌రౌండర్లకు బదులుగా.. అడపాదడపా రాణించే క్రికెటర్లపై ఆధారపడటం పెద్ద సమస్యగా మారిందని అభిప్రాయపడ్డాడు. ఇది ఏమాత్రం సరైన వ్యూహం కాదన్నాడు అశ్విన్.

    ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ ఓటమి పాలైన నేపథ్యంలో అశ్విన్ పలు కీలక అంశాల గురించి మాట్లాడాడు. హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ సమస్యలు జట్టుకు పెద్ద సవాలుగా మారాయని, అతనికి సరైన ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేయడంలో టీమ్ మేనేజ్మెంట్ విఫలమైందని పేర్కొన్నాడు. ప్రస్తుతం.. నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే పేర్లు వినిపిస్తున్నప్పటికీ, గాయాల బెడద కారణంగా వారిపై పూర్తిస్థాయిలో ఆధారపడటం కష్టమేనన్నాడు. దీనికి 2023 వన్డే ప్రపంచకప్‌ను ఉదాహరణగా ప్రస్తావిస్తూ.. 'హార్దిక్ గాయపడిన సమయంలో నాటి కోచ్ రాహుల్ ద్రవిడ్ చక్కటి వ్యూహాన్ని అమలు చేశారు. ఆరో బౌలర్ కోసం వెతకలేదు. ఐదుగురు బౌలర్లతోనే జట్టును సమతూకంగా నడిపించి టీమ్‌ను ఫైనల్ వరకు తీసుకెళ్లగలిగారు' అని చెప్పుకొచ్చాడు. జట్టులోని ప్రతి ఆటగాడికీ తన పాత్రపై స్పష్టత ఉండటం ద్రవిడ్ విధానంలో ప్రధాన బలమని ఈ మాజీ స్పిన్నర్ వివరించాడు.

    'ప్రస్తుతం.. గౌతీ ఆధ్వర్యంలోని టీమ్ మేనేజ్మెంట్ అన్ని విభాగాల్లో నైపుణ్యం కలిగిన ఆటగాళ్లపై అతిగా దృష్టి సారిస్తోంది. దానివల్ల టెస్ట్ క్రికెట్‌లో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. టెస్టుల్లోనైనా, ప్రపంచకప్ వంటి పెద్ద టోర్నీల్లోనైనా మ్యాచ్ విజేతలుగా నిలిచే ప్రత్యేక నైపుణ్యం కలిగిన ఆటగాళ్లకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి' అని అశ్విన్ సూచించాడు. వరల్డ్ కప్‌ సన్నాహాల్లో భాగంగా.. తొలుత 17-18 మంది ప్లేయర్లతో ఒక స్థిరమైన జట్టును ఫిక్స్ చేసుకోవాలని అశ్విన్ సలహా ఇచ్చాడు. వచ్చే 14 నెలలపాటు వారినే రొటేషన్ పద్ధతిలో ఆడించాలన్నాడు. ఆ టీమ్‌లో ఇద్దరు వికెట్ కీపర్లు, ముగ్గురు స్పిన్నర్లు, ఐదుగురు పేసర్లు ఉండేలా ప్లాన్ చేసుకోవాలని చెప్పుకొచ్చాడు. ప్రపంచకప్ ఆరంభమయ్యే సమయానికి అత్యుత్తమ తుది జట్టును సిద్ధం చేయడమే లక్ష్యంగా ఉండాలని.. ప్రస్తుతం జట్టు ఎంపికలో అలాంటి స్పష్టత లోపించిందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement