• Jul 26, 2026
  • NPN Log

    హైదరాబాద్‌ : ‘‘నేనే మీ తమ్ముడిని.. నేను చనిపోలేదు’’ అంటూ ఓ మహిళకు ఫోన్‌ చేసిన దుండగుడు ఏడాదిపాటు ఆమెను రకరకాలుగా బెదిరించి, వేధించి రూ.23 లక్షలు తన ఖాతాలోకి వేయించుకున్నాడు! కొద్దిరోజులుగా ఆమె భర్త ఫోన్‌కు అసభ్య సందేశాలు పంపిస్తూ.. పరువు తీస్తానని, పిల్లలను చంపేస్తానని భయపెడుతుండడంతో ఆమె సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. తన కుటుంబం గురించి బాగా తెలిసిన వారే ఇలా చేస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఆ మహిళ తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి తెల్లాపూర్‌లో ఉంటోంది. ఆమె తమ్ముడు రవిచంద్ర 2023 సెప్టెంబరులో, తల్లి 2024 ఆగస్టులో అనారోగ్యంతో మృతి చెందారు. తల్లి మరణించిన తర్వాత ఆమె ఫోన్‌ను కుమార్తె వాడుతోంది. ఆ ఫోన్‌కు కాల్‌ చేసిన ఒక వ్యక్తి.. తన పేరు రాహుల్‌ అని, తాను రవిచంద్ర స్నేహితుణ్నని, అతడు తనకు డబ్బులు బాకీ ఉన్నాడని చెప్పాడు. రవిచంద్ర చనిపోయాడని ఆమె చెప్పడంతో అప్పటికి ఫోన్‌ కట్‌ చేశాడు. తర్వాత కొన్ని రోజులకు మళ్లీ అతడే ఫోన్‌ చేసి.. ‘‘నేనే నీ తమ్ముణ్ని.. రవిచంద్రని.. నేను చనిపోలేదు. బతికే ఉన్నాను’’ అని చెప్పాడు. తన మాట నిజమేనని నమ్మించేందుకు చిన్ననాటి సంఘటనలు, కుటుంబ సభ్యుల పేర్లు, బంధువుల వివరాలు, గ్రామంలోని ఇంటి గురించి, ఇంట్లోని వస్తువులు, అల్మారాలో ఉన్న ఆభరణాల వివరాలతో సహా అన్నీ చెప్పడంతో ఆమె తీవ్ర అయోమయానికి గురైంది. ‘‘ప్రస్తుతం నువ్వు ఎక్కడ ఉన్నావు? నీవు చనిపోలేదంటే.. మేం ఎవరికి అంత్యక్రియలు నిర్వహించాం?’’ అని ఆందోళన చెందింది. అయితే, అతడు మాత్రం ఆమె అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పకుండా.. రవిచంద్ర పేరిట ఉన్న జీవిత బీమా పాలసీని క్లెయిమ్‌ చేసి, ఆ డబ్బు తనకు ఇవ్వాలని, గ్రామంలో ఉన్న ఇల్లు అమ్మి డబ్బు ఇవ్వాలని వేధించేవాడు. ‘‘లేదంటే నీ కుటుంబసభ్యుల మరణాలకు నువ్వే కారణమని ప్రచారం చేస్తా.. గ్రామంలో పరువు తీస్తా’’ అని బెదిరించేవాడు. అతడి బెదిరింపులకు భయపడి ఆమె ఏడాది కాలంలో రూ.23 లక్షలు అతడి ఖాతాలో వేసింది. అందులో రూ.13 లక్షలు నేరుగా తన ఖాతా నుంచి వేసినవి కాగా.. మరో రూ.10 లక్షలు వేర్వేరు మార్గాల ద్వారా బదిలీ చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

    భర్త, బంధువులకు అసభ్య సందేశాలు..

    ఆమె ఎంత ఇచ్చినా.. ఇంకా డబ్బు డిమాండ్‌ చేయడంతో పాటు వేధింపుల డోసు పెంచిన అగంతకుడు.. ‘‘డబ్బులు ఇవ్వకుంటే నీ భర్తను, పిల్లలను చంపేస్తాన’’ టూ హెచ్చరించడం మొదలుపెట్టాడు. ఈ ఏడాది జనవరిలో ఆమె భర్త ఫోన్‌కు అసభ్య సందేశాలు పంపాడు. ఆమె పరువుకు భంగం కలిగించే సందేశాలను బంధువులకు కూడా పంపడం ప్రారంభించాడు. దీంతో ఆమె సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు మేరకు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఉపయోగించిన నాలుగు మొబైల్‌ నంబర్లు, బ్యాంకు ఖాతా, ఈ-మెయిల్‌ వివరాల ఆధారంగా విచారణ కొనసాగుతోందని సైబర్‌ క్రైం పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement