• Jul 26, 2026
  • NPN Log

    న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి (క్యూ1) రూ.3,352 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ రూ.3,330.4 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. నికర లాభంలో స్వల్ప వృద్ధి నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో కంపెనీ కార్యకలాపాల ద్వారా రాబడి గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో (రూ.22,134.6 కోట్లు) పోల్చితే 10.6 శాతం వృద్ధి చెంది రూ.24,478.6 కోట్లకు చేరుకుంది. త్రైమాసిక ప్రాతిపదికన లాభం 4.2శాతం తగ్గగా.. రాబడి మాత్రం 1 శాతం మేర పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో ఐటీ సర్వీసుల విభాగం నుంచి రాబడి 2,614.5 మిలియన్‌ డాలర్లుగా ఉంది. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఇందులో వృద్ధి 1 శాతం ఉండగా.. త్రైమాసికం ప్రాతిపదికన 1.4 శాతం తక్కువగా ఉంది. జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికానికి (క్యూ2) ఐటీ సర్వీసుల వ్యాపార ఆదాయం 257.4 కోట్ల డాలర్ల నుంచి 262.7 కోట్ల డాలర్ల మధ్య ఉంటుందని విప్రో అంచనా వేస్తోంది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో మొత్తం బుకింగ్స్‌ 3,370 మిలియన్‌ డాలర్లుగా ఉంది. భారీ డీల్‌ బుకింగ్స్‌ 1,626 మిలియన్‌ డాలర్లకు చేరాయి. మొదటి త్రైమాసికంలో ఐటీ సర్వీసుల ఆపరేటింగ్‌ మార్జిన్‌ 16 శాతానికి క్షీణించింది. మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చిన వేతన పెంపుదల ప్రభావం, ఏఐ రంగంలో కొనసాగుతున్న పెట్టుబడుల కారణంగా ఈ 1.2 శాతం వార్షిక క్షీణత నమోదైందని విప్రో సీఎ్‌ఫఓ అపర్ణ అయ్యర్‌ చెప్పారు. కాగా, కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ.2 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.

    సరిపోయేంతగా ఫ్రెషర్లు.. : ఈ జూన్‌ చివరినాటికి కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,43,044గా ఉంది. మొదటి త్రైమాసికంలో ఫ్రెషర్లను నియమించుకోలేదని విప్రో యాజమాన్యం పేర్కొంది. అలాగే, ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫ్రెషర్ల నియామక టార్గెట్‌ను కూడా సంస్థ వెల్లడించలేదు. తమ వద్ద సరిపోయేంతగా ఫ్రెషర్లు ఉన్నారని, గత ఏడాదిలో దాదాపు 7,500 మందిని నియమించుకున్నామని చీఫ్‌ హ్యూమన్‌ రీసోర్సెస్‌ ఆఫీసర్‌ సౌరభ్‌ గోవిల్‌ తెలిపారు.

     

    అనిశ్చితులతో నిర్ణయాలపై ప్రభావం: స్థూల ఆర్థిక వాతావరణం పటిష్టంగానే ఉన్నప్పటికీ అనిశ్చితులు తమ క్లయింట్ల నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయని విప్రో సీఈఓ, ఎండీ శ్రీని పల్లియా పేర్కొన్నారు. టెక్నాలజీ పెట్టుబడులు మందగించలేదని, అవి మరింత నిర్దిష్టంగా మారాయని తెలిపారు. పరిస్థితులు మారుతున్న కొద్దీ క్లయింట్లు పెట్టుబడులపై ఫలితాలను మరింత కఠినంగా పరిశీలిస్తున్నారన్నారు. క్లయింట్లు ఎంపిక చేసిన వాటికే ఖర్చు చేస్తున్నప్పటికీ కంపెనీకి ఆర్డర్ల లభ్యత మెరుగ్గానే ఉందన్నారు. క్లయింట్లు నాణ్యత, స్థిరత్వం, ఉత్పాదకతను మెరుగుపరిచే కృత్రిమ మేధ ఆధారిత ఆపరేటింగ్‌ మోడళ్లవైపు అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement