• Jul 26, 2026
  • NPN Log

    ఢిల్లీ : దేశంలో నెట్‌వర్క్ లేని మారుమూల ప్రాంతాలు, కొండ కోనల్లోనూ నిరంతరాయంగా కమ్యూనికేషన్ అందించేందుకు వీలుగా బీఎస్‌ఎన్‌ఎల్ ఓ సరికొత్త శాటిలైట్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పన్నులతో కలిపి దీని ధరను రూ.1,34,166గా నిర్ణయించారు. సాధారణ స్మార్ట్‌ఫోన్‌ల వలే కాకుండా, ఇది నేరుగా ఉపగ్రహాల సాయంతో పనిచేస్తుంది. మనం వాడే సాధారణ ఫోన్లు దగ్గరలోని మొబైల్ టవర్ల సిగ్నల్స్ ఆధారంగా పనిచేస్తాయి. కానీ, ఈ శాటిలైట్ ఫోన్ నేరుగా అంతరిక్షంలోని ఉపగ్రహాలతో అనుసంధానమై ఉంటుంది. దీనికోసం బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ గ్లోబల్ శాటిలైట్ నెట్‌వర్క్ ప్రొవైడర్ అయిన 'ఇన్మార్శాట్' తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మొబైల్ కవరేజ్ లేని ప్రాంతాల్లో, అత్యవసర సమయాల్లో వాయిస్ కాల్స్ చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

    శాటిలైట్ ఫోన్ ముఖ్య ఫీచర్లు:

    విస్తృతమైన కనెక్టివిటీ: మొబైల్ నెట్‌వర్క్ పరిధి దాటిన ప్రాంతాల్లోనూ శాటిలైట్ కనెక్టివిటీ అందిస్తుంది.

    వాయిస్ కాలింగ్: మారుమూల ప్రాంతాల నుంచి కూడా స్పష్టమైన వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.

    SOS ఎమర్జెన్సీ సపోర్ట్: ఆపద సమయంలో లేదా అత్యవసర పరిస్థితుల్లో రక్షణ కోసం 'SOS' ఫీచర్ ఇందులో ఉంది.

    మెరుగైన బ్యాటరీ లైఫ్: ఛార్జింగ్ సదుపాయాలు లేని చోట కూడా ఎక్కువ రోజులు పనిచేసేలా దీర్ఘకాలిక బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

    డ్యూరబుల్ డిజైన్: కఠినమైన వాతావరణ పరిస్థితులను, ప్రమాదాలను తట్టుకునేలా అత్యంత పటిష్ఠంగా దీన్ని రూపొందించారు.

    ఎవరు కొనుగోలు చేయవచ్చు?

    ఈ ఫోన్ సాధారణ మొబైల్ వినియోగదారుల కోసం ఉద్దేశించింది కాదు. నెట్‌వర్క్ లేని ప్రదేశాలలో క్లిష్టమైన విధులు నిర్వహించే వ్యూహాత్మక రంగాలు, వ్యక్తుల కోసం దీనిని డిజైన్ చేశారు. ముఖ్యంగా.. రక్షణ రంగం, సముద్రయాన కార్యకలాపాలు, విపత్తు నిర్వహణ బృందాలు, మైనింగ్, పారిశ్రామిక రంగాలు, మారుమూల ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లే యాత్రికులు, అడ్వెంచర్ ట్రావెలర్స్ ఈ శాటిలైట్ ఫోన్ కొనుగోలు చేయొచ్చు.

    ప్రభుత్వ అనుమతి తప్పనిసరి

    భారతదేశంలో శాటిలైట్ ఫోన్ల వినియోగంపై కఠినమైన నిబంధనలు ఉన్నాయి. కాబట్టి, ఎవరు పడితే వారు దీనిని నేరుగా కొనేయడానికి వీల్లేదు. ఈ ఫోన్‌ను కొనుగోలు చేయాలన్నా లేదా ఉపయోగించాలన్నా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని టెలికమ్యూనికేషన్ల శాఖ (DoT) నుంచి ముందస్తుగా స్పష్టమైన అనుమతి (Authorisation) పత్రాన్ని పొందాల్సి ఉంటుంది. లైసెన్స్ లేదా అనుమతి లేకుండా శాటిలైట్ ఫోన్‌ను కలిగి ఉండటం భారత చట్టాల ప్రకారం నేరం, దీనివల్ల చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

    ఈ సేవలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి కస్టమర్లు తమకు దగ్గరలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయాన్ని సందర్శించవచ్చు లేదా 9768866652 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు.

    మరోవైపు BSNL 4G విస్తరణ..

    ఒకవైపు శాటిలైట్ ఫోన్ సేవలను ప్రారంభిస్తూనే, మరోవైపు దేశవ్యాప్తంగా తన సాధారణ మొబైల్ నెట్‌వర్క్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ శరవేగంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 99వేల 4G సైట్లను (టవర్లను) బీఎస్‌ఎన్‌ఎల్ విజయవంతంగా ఏర్పాటు చేసింది. మార్కెట్లో పట్టు సాధించేందుకు మరిన్ని అదనపు 4G సైట్లను ఏర్పాటు చేయడానికి కూడా యోచిస్తోంది.

    ఇదిలా ఉండగా, దేశంలో ఇప్పటికే మిలిటరీ (రక్షణ రంగం), సరిహద్దు భద్రతా దళాలు (BSF), కోస్ట్ గార్డ్, విపత్తు నిర్వహణ బృందాలు (NDRF), ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగాలు ఈ ఫోన్లను విస్తృతంగా వాడుతున్నాయి. ఆయా సంస్థలు టెలికాం శాఖ (DoT) నుంచి ప్రత్యేక లైసెన్స్ పొంది చాలా కాలంగా వీటిని వాడుతున్నాయి. ముంబై ఉగ్రదాడుల (26/11) సమయంలో ఉగ్రవాదులు విదేశీ శాటిలైట్ ఫోన్లను వాడటం వల్ల దేశ రక్షణ దృష్ట్యా ప్రభుత్వం వీటిపై కఠినమైన ఆంక్షలు విధించింది. అనుమతి లేని విదేశీ శాటిలైట్ ఫోన్లు వాడితే జైలు శిక్ష కూడా పడుతుంది.

    బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) గతంలోనూ (2018 నుంచే) ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు గేట్‌వే సర్వీసుల ద్వారా ఈ సేవలను అందిస్తోంది. అయితే ఇప్పుడు రూ.1.34 లక్షల ధరతో అధికారిక హ్యాండ్‌సెట్‌ను నిబంధనలకు లోబడి విక్రయించడానికి అందుబాటులోకి తెచ్చింది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement