2028 నుంచి 100% సుంకాలు, ఆ తర్వాత 200%.. జనరిక్ మందులపై ట్రంప్ కీలక నిర్ణయం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక వాణిజ్య నిర్ణయం ప్రకటించారు. విదేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే జనరిక్ మందులపై రెండేళ్ల పాటు సుంకాలేవీ ఉండబోవని ప్రకటించారు. ఆ తర్వాత 2028 ఆగస్టు నుంచి 100 శాతం టారిఫ్ విధించనున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత ఏడాది నుంచి ఈ టారిఫ్‌ను 200 శాతానికి పెంచుతామన్నారు. అమెరికాలో ఔషధ తయారీని ప్రోత్సహించడమే ఈ నిర్ణయం వెనుకున్న ప్రధాన ఉద్దేశమని ట్రంప్ తెలిపారు. జనరిక్ మందులను ఉత్పత్తి చేసే కంపెనీలు తొలి రెండేళ్లలో అమెరికాలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఔషధాలను దేశీయంగానే ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్ వెల్లడించారు.
అమెరికాకు జనరిక్ మందులను సరఫరా చేసే ప్రధాన దేశాల్లో భారత్ ఒకటి. భారతీయ ఫార్మా కంపెనీలు అమెరికా మార్కెట్‌పై గణనీయంగా ఆధారపడుతున్నాయి. అందువల్ల 2028 నుంచి అమల్లోకి వచ్చే ఈ టారిఫ్‌లు భారత ఔషధ ఎగుమతులపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే రెండేళ్ల గడువు ఇవ్వడంతో కంపెనీలు తమ ఉత్పత్తి, పెట్టుబడి వ్యూహాలను మార్చుకునేందుకు సమయం లభించనుంది.









Comments