• Jul 26, 2026
  • NPN Log

    ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' మరో కొత్త ఫీచర్‌ను తీసుకు వచ్చింది. వినియోగదారుల గోప్యతను మరింత బలోపేతం చేసే కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇకపై కొత్త వ్యక్తులతో చాట్ చేయాలంటే తప్పనిసరిగా ఫోన్ నంబర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దాని బదులుగా యూజర్‌నేమ్ ద్వారా ఇతరులతో కనెక్ట్ అయ్యే అవకాశం కల్పించింది. 

    ప్రస్తుతం వాట్సాప్‌లో ఎవరితోనైనా చాట్ చేయాలంటే మొబైల్ నంబర్ తప్పనిసరి. కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వినియోగదారులు తమకు నచ్చిన ప్రత్యేకమైన యూజర్‌నేమ్‌ను ఎంచుకోవచ్చు. దీంతో వ్యక్తిగత మొబైల్ నంబర్‌ను ఇతరులతో పంచుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. అయితే ఒక వ్యక్తిని తొలిసారి కాంటాక్ట్ చేయాలంటే అతడి యూజర్ నేమ్ కచ్చితంగా తెలియాలి. ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ప్రైవసీ కోసం ఇప్పటికే ఉన్న 'బ్లాక్', 'సైలెన్సింగ్ అన్‌నోన్ కాలర్స్' వంటి ఫీచర్స్ కొనసాగుతాయి.

    వాట్సాప్‌లో యూజర్‌నేమ్ 3 నుంచి 35 అక్షరాల మధ్య ఉండేలా రూపొందించవచ్చు. ఒకే యూజర్‌నేమ్‌ను ఇద్దరు ఉపయోగించలేరు. ప్రముఖులు, సంస్థలకు సంబంధించిన కొన్ని పేర్లను ముందుగానే రిజర్వ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. అలాగే యూజర్‌నేమ్‌తో పాటు అదనపు భద్రత కోసం ప్రత్యేక 'యూజర్‌నేమ్ కీ'ని కూడా వాట్సాప్ తీసుకురానుంది. దీనివల్ల మీ యూజర్‌నేమ్ తెలిసినా, యూజర్‌నేమ్ కీ లేకుండా కొత్త వ్యక్తులు నేరుగా సంప్రదించలేరు. దీంతో స్పామ్ సందేశాలు, అనవసర చాట్‌లను తగ్గించే అవకాశం ఉంది.

    ప్రస్తుతానికి ఈ ఫీచర్ పరిమిత సంఖ్యలో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అక్కడ యూజర్ నేమ్ సెట్ చేసుకునే ఆప్షన్ ఉందో, లేదో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆ ఆప్షన్ కనబడకపోతే రాబోయే కొద్ది రోజుల్లో మీకు ఆ అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement