• Jul 26, 2026
  • NPN Log

    న్యూఢిల్లీ: అదానీ, జీఎంఆర్‌ వంటి విమానాశ్రయాల నిర్వాహణ సంస్థలను కూడా ఎయిర్‌లైన్స్‌ వ్యాపారంలోకి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన విధానాలను సడలించే దిశగా పౌర విమానయాన శాఖ ఇప్పటికే అంతర్గత చర్చలను ప్రారంభించినట్లు తెలిసింది. అయితే, ఈ విధానపరమైన మార్పునకు కేంద్ర న్యాయ శాఖతో పాటు ప్రధాని నేతృత్వంలోని కేబినెట్‌ కమిటీ కూడా ఆమోదం తెలపాల్సి ఉంటుంది. నిబంధనల మార్పు ద్వారా దేశీయ విమానయాన సేవల విభాగంలో 90 శాతం మార్కెట్‌ వాటా కలిగిన ఇండిగో, ఎయిరిండియాల ఆధిపత్యానికి అడ్డుకట్ట పడనుంది. అలాగే, కొత్త ఎయిర్‌లైన్స్‌ ప్రవేశంతో మార్కెట్లో పోటీ పెరుగుతుందని కేంద్రం భావిస్తోందని ఈ విషయంతో సంబంధమున్న వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం విమానాశ్రయాల నిర్వహణ సంస్థలు ఏదేని ఎయిర్‌లైన్స్‌లో 10 శాతానికి మించి వాటా కలిగి ఉండటానికి అనుమతి లేదు. ఈ పరిమితిని ఎత్తివేస్తే, విమానాశ్రయ నిర్వహణ సంస్థలు కూడా ఎయిర్‌లైన్స్‌లో యాజమాన్య వాటా కలిగి ఉండటంతో పాటు వాటిని నిర్వహించేందుకు వీలు కలగనుంది. ప్రస్తుతం అదానీ గ్రూప్‌ ముంబైలో రెండు ఎయిర్‌పోర్ట్‌లతో పాటు మరో 6 విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. దేశీయంగా జీఎంఆర్‌ గ్రూప్‌ చేతిలో హైదరాబాద్‌, ఢిల్లీ, గోవా ఎయిర్‌పోర్ట్‌లున్నాయి. భోగాపురం విమానాశ్రయం వచ్చే నెలలో ప్రారంభం కానుంది.

    అదానీ ఆసక్తి: ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సడలిస్తే కొత్త ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించేందుకు భారత కుబేరుడు గౌతమ్‌ అదానీ ఆసక్తిగా ఉన్నట్లు రాయిటర్స్‌ తాజా కథనం వెల్లడించింది. అయితే, అంతగా లాభాలు పంచే వ్యాపారం కాకపోవడంతో పాటు రిస్క్‌ ఎక్కువ కావడంతో అన్ని లెక్కలూ సరిచూసుకున్న తర్వాతే అదానీ బరిలోకి దిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అదే గనుక జరిగితే, ఎయిర్‌లైన్స్‌ మార్కెట్లో ఇండిగో, ఎయిరిండియాకు అదానీ గట్టి పోటీనిచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

    పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు దారితీయొచ్చు: భాటియా

    ఎయిర్‌పోర్టుల నిర్వాహకులను ఎయిర్‌లైన్స్‌ వ్యాపారంలోకి అనుమతిస్తే భారీ పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు తావిచ్చినట్లవుతుందని ఇండిగో సహ వ్యవస్థాపకుడు, ఎండీ రాహుల్‌ భాటియా అభిప్రాయపడ్డారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement