ఐటీ షేర్లపై ఆసక్తి.. కొనసాగుతున్న లాభాలు..
గత రెండ్రోజులుగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న ఐటీ రంగ షేర్లు కోలుకున్నాయి. విలువలు ఆకర్షణీయంగా ఉండడంతో ఐటీ రంగ షేర్లపై మదుపర్లు ఆసక్తి చూపుతున్నారు. అలాగే జూన్ త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలు వెల్లడవుతుండడం కూడా మదుపర్ల ఆసక్తికి కారణంగా నిలుస్తోంది. ఇక, అమెరికా ఫ్యూచర్స్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 96.30గా ఉంది. బ్యాంకింగ్ రంగం మాత్రం నష్టాల్లో ఉంది.
గత సెషన్ ముగింపు (77,185)తో పోల్చుకుంటే గురువారం ఉదయం దాదాపు 200 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కూడా స్థిరంగా కొనసాగుతోంది. ఉదయం 9:45 గంటల సమయంలో సెన్సెక్స్ 224 పాయింట్ల లాభంతో 77,409 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 52 పాయింట్ల లాభంతో 24,131 వద్ద కదలాడుతోంది.
సెన్సెక్స్, నిఫ్టీలో డిక్సన్ టెక్నాలజీస్, ఎస్ఆర్ఎఫ్, హింద్ పెట్రో, బీపీసీఎల్, కేన్స్ టెక్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఐసీఐసీఐ లాంబార్డ్, హెచ్డీఎఫ్సీ ఏఎమ్‌సీ, ఐసీఐసీఐ ప్రుడెన్సియల్, పీబీ ఫిన్‌టెక్, వెర్నోవా టీడీ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 76 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 138 పాయింట్ల నష్టంతో ఉంది.










Comments