రూ.9,786 కోట్లు!
బ్రస్సెల్స్ : ప్లే స్టోర్, సెర్చ్ ఇంజన్ల ద్వారా.. వినియోగదారులను తన సొంత సర్వీసుల వైపు మళ్లిస్తూ పోటీదారులకు నష్టం కలిగేలా వ్యవహరించినందుకు గూగుల్‌కు యూరోపియన్ యూనియన్(ఈయూ) 890 మిలియన్ యూరోల భారీ జరిమానా విధించింది. అంటే మన కరెన్సీలో ఏకంగా రూ.9786 కోట్లకు పైమాటే! గూగు ల్ ఇలా చేయడం డిజిటల్ యాంటీ ట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించడమేనని ఈయూ పేర్కొంది. దీనివల్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉందని తెలిసినా.. యూరప్ దేశాలపై సుంకాలు పెంచేస్తానంటూ ట్రంప్ ఇప్పటికే రంకెలు వేస్తున్నా.. ఈయూ ఏమాత్రం వెరవక గూగుల్‌కు ఈస్థాయిలో భారీ జరిమానా విధించడం గమనార్హం. నిజానికి అమెరికా కంపెనీలపై జరిమానాలు విధిస్తే అందుకు ప్రతీకారం తీర్చుకుంటామని ట్రంప్ గతంలోనే హెచ్చరిక జారీ చేశారు కూడా. ఆయన హెచ్చరికలకు కారణం.. గతంలో ఈయూ గూగుల్‌పై వేసిన 4.1 బిలియన్ యూరోల జరిమానా. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా గూగుల్ తనకున్న ఆధిపత్యాన్ని ఉపయోగించుకుని.. ఫోన్లలో గూగుల్ సెర్చ్, క్రోమ్, ప్లేస్టోర్ వంటి యాప్స్‌ను ముందే ఇన్స్టాల్ చేసేలా మొబైల్ తయారీ సంస్థలపై ఒత్తిడి తెచ్చినందుకు 2018లో ఈయూ గూగుల్‌పై 4.34 బిలియన్ యూరోల జరిమానా విధించింది. దానిపై గూగుల్ అప్పీల్ చేయగా దిగువ ట్రిబ్యునల్ ఆ జరిమానాను స్వల్పంగా 4.1 బిలియన్ యూరోలకు తగ్గించింది. దీనిపై గుగుల్ లగ్జెంబర్గ్‌లోని అత్యున్నత కోర్టుకు వెళ్లగా.. ఈ నెల (జూలై) 2న కోర్టు గూగుల్‌కు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ఆ తీర్పు వచ్చిన నెలలోపే గూగుల్‌కు మరోసారి భారీ జరిమానా పడింది.










Comments