• Jul 26, 2026
  • NPN Log

    భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ విషయంలో జట్టు యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరుపై మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఒకప్పుడు భారత బౌలింగ్ దళానికి ప్రధాన అస్త్రంగా నిలిచిన షమీని ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోందని మండిపడ్డాడు. రానున్న వన్డే ప్రపంచ కప్ 2027కు భారత జట్టులో చోటు దక్కే ప్లేయర్ల గురించి చర్చిస్తున్న సందర్భంలో శ్రీకాంత్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

    ‘ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, మొహ్సిన్ ఖాన్.. వీరంతా మంచి బౌలర్లు. ప్రపంచ కప్ టోర్నీకి ఇంకా 15 నెలల సమయం ఉంది. ఈ యువ ప్లేయర్లకు ఇప్పుడే పక్కన పెట్టలేం. కానీ షమీ అసాధారణ బౌలర్. అతడిని టీమ్ మేనేజ్‌మెంట్ ఎవ్వరూ పట్టించుకోని స్థితికి తీసుకొచ్చింది. ఇది నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది’ అని క్రిస్ శ్రీకాంత్ వెల్లడించాడు. 2023 వన్డే ప్రపంచ కప్‌లో 24 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన షమీ.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత జట్టుకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దేశవాళీ క్రికెట్‌లో రాణించినప్పటికీ ఏ సిరీస్‌కూ ఎంపిక కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

    బుమ్రా ఉంటేనే..

    2027 ప్రపంచ కప్‌లో భారత్ విజయావకాశాలు పూర్తిగా జస్ప్రీత్ బుమ్రా పైనే ఆధారపడి ఉంటాయని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. ‘బుమ్రా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ చాలా కీలకం. అతడు భారత క్రికెట్‌కు దొరికిన అమూల్యమైన వజ్రం. బుమ్రా ఉంటేనే భారత్ ప్రపంచ కప్ గెలిచే అవకాశం ఉంటుంది. అతడు లేకపోతే మిగతా బౌలర్లతో అది చాలా కష్టం. అయితే దక్షిణాఫ్రికా పిచ్‌లపై ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ కూడా కీలక పాత్ర పోషించగలరు. అర్ష్‌దీప్‌ సింగ్‌కు తొలి రెండు ఓవర్లలో బంతి స్వింగ్ అయ్యే వరకు మాత్రమే ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత అతడు పెద్దగా ప్రభావం చూపలేడు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా తొలి ఓవర్ అద్భుతంగా వేసినా.. ఆ తర్వాత బ్యాటర్లు అతడిపై పూర్తిగా ఆధిపత్యం చెలాయించారు. అందుకే అతడు 50 ఓవర్ల ఫార్మాట్‌కు సరిపోడు’ అని క్రిస్ శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement