• Jul 26, 2026
  • NPN Log

    ముంబై: దేశంలో అత్యంత ధనికులైన గౌతమ్‌ అదానీ, ఆయన కుటుంబం తాజాగా స్థిరాస్తి వ్యాపార సంపన్నుల జాబితాలోనూ అగ్రస్థానానికి ఎగబాకింది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ప్రతికూల పవనాలు వీస్తున్న తరుణంలోనూ అదానీ కుటుంబానికి చెందిన స్థిరాస్తి వ్యాపారం విలువ గత ఏడాదిలో ఏకంగా 72.5 శాతం పుంజుకుంది. మంగళవారం విడుదలైన ‘2026 గ్రోహే-హురున్‌ ఇండియా రియల్‌ ఎస్టేట్‌ 150’ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ ప్రాపర్టీస్‌ చాలా ఏళ్లుగా రియల్టీ వ్యాపారం సాగిస్తోంది.. పలు నగరాల్లో ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ముంబైలోని ధారావి మురికివాడ పునరాభివృద్ధి ప్రాజెక్టును సైతం ఈ కంపెనీయే దక్కించుకుంది. అదానీ కుటుంబ సభ్యులైన ప్రణవ్‌ అదానీ, రాజేశ్‌ అదానీ ఈ సంస్థకు సారథ్యం వహిస్తున్నారు. గత ఏడాది అదానీ ప్రాపర్టీస్‌ విలువ రూ.38,000 కోట్లు పెరిగి రూ.90,400 కోట్లకు చేరుకుందని రిపోర్టు వెల్లడించింది. కంపెనీలో వంద శాతం వాటా కలిగి ఉన్న అదానీ ఫ్యామిలీ రియల్టీ రంగంలో అత్యంత ధనిక కుటుంబంగా అవతరించిందని తెలిపింది. అంతేకాదు, దేశంలోని అత్యంత విలువైన రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల్లోనూ అదానీ ప్రాపర్టీస్‌ 4వ స్థానానికి ఎగబాకింది. అలాగే, అత్యంత విలువైన అన్‌ లిస్టెడ్‌ రియల్టీ కంపెనీగానూ ఎదిగింది.

     

    బీఎస్ఈ రియల్టీ సూచీ 20 శాతం పతనం

    అదానీ అందలం ఎక్కినప్పటికీ, గత ఏడాది రియల్టీ రంగానికి మాత్రం అంతగా కలిసిరాలేదు. బీఎ్‌సఈలోని రియల్టీ కంపెనీల ప్రాతినిధ్య సూచీ 20 శాతం క్షీణించింది. జాబితాలోని టాప్‌-150 సంస్థల్లో 74 కంపెనీల మార్కెట్‌ విలువ తగ్గింది. 150 సంస్థల మొత్తం విలువ కూడా కేవలం 2 శాతం పెరిగి రూ.16.5 లక్షల కోట్లకు చేరిందని రిపోర్టు వెల్లడించింది. గడిచిన 9 ఏళ్లలో ఇదే అత్యంత కనిష్ఠ విలువ వృద్ధి అని హురున్‌ ఇండియా వ్యవస్థాపకుడు, ప్రధాన పరిశోధకుడు అనాస్‌ రహ్మాన్‌ జునైద్‌ అన్నారు.

    రెండో స్థానానికి డీఎల్‌ఎఫ్‌ రాజీవ్‌ సింగ్‌

    కాగా రూ.1.46 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌తో డీఎల్‌ఎఫ్‌ దేశంలో అత్యంత విలువైన రియల్టీ కంపెనీగా తన అగ్రస్థానాన్ని కొనసాగించింది. గడిచిన ఏడాది కాలం లో (2026 మే 29నాటికి) డీఎల్‌ఎఫ్‌ మార్కెట్‌ విలువ 29.3 శాతం క్షీణించింది. దాంతో డీఎల్‌ఎఫ్‌ ప్రమోటర్‌ రాజీవ్‌ సింగ్‌ కుటుంబం రూ.90,200 కోట్ల ఆస్తులతో స్థిరాస్తి రంగ సంపన్నుల జాబితాలో రెండో స్థానానికి జారుకుంది.

    విలువైన రియల్టీ కంపెనీల్లో లోధా డెవలపర్స్‌ (రూ.93,700 కోట్లు) రెండో స్థానంలో ఉండగా.. టాటా గ్రూప్‌నకు చెందిన ఆతిథ్య సేవల కంపెనీ ఐహెచ్‌సీఎల్‌ (రూ.93,300 కోట్లు) 3వ స్థానంలో నిలిచింది. ఓయో బ్రాండ్‌ హోటళ్ల నిర్వహణ సంస్థ ప్రిజమ్‌ (రూ.67,200 కోట్లు) ఐదో స్థానాన్ని దక్కించుకుంది. ఈ కంపెనీ తొలిసారిగా టాప్‌ టెన్‌లోకి ప్రవేశించింది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement