• Jul 26, 2026
  • NPN Log

    యూపీఎస్సీ నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌లో రెండో దశ మెయిన్స్‌ ఆగస్టు 21 నుంచి ఆరంభమవుతుంది. వేర్వేరుగా అయిదు రోజులు - తొమ్మిది పేపర్లు రాయాలి. మెయిన్స్‌ విషయంలో సొంత ప్రతిభ మాత్రమే పోటీదారుల్లో మనల్ని విలక్షణంగా నిలుపుతుంది. ఆ క్రమంలో పాటించదగ్గ కొన్ని ప్రిపరేషన్‌ టిప్స్‌. కొద్ది రోజుల క్రితం జరిగిన ప్రిలిమ్స్‌ చుక్కలు చూపించిందన్నది తెలిసింది. ఒక్క మాటలో చెప్పాలంటే, యూపీఎస్సీ చేసిన మార్పులు బలంగా కనిపించాయి. అలా అనుకుంటే మెయిన్స్‌లోనూ యాదృచ్చిక, కీలక పదాల స్థానే లోతు, నాణ్యతకు ప్రాధాన్యం లభించవచ్చు.

    ఈ పరిస్థితుల్లో నాణ్యత రారాజు కానుంది. లోతైన విశ్లేషణ అలాగే ప్రతి పేపర్‌లో డైనమిజమ్‌ తొంగి చూసే అవకాశమే ఎక్కువ.

    మునపటి ప్రశ్నపత్రాలకు ఇప్పటికీ ప్రాధాన్యం ఉంది. అయితే అవే మార్గదర్శకం అనుకుంటే సరిపోదు.

    ప్రతి పేపర్‌లో స్థిర సమాచారానికి సమకాలీన సంఘటనల జోడింపు అవసరమవుతుంది. గత ఏడాది జరిగిన మెయిన్స్‌ పేపర్లలోనే అనువర్తింపు(అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌) ఎక్కువగా ఉంది.

    జనరల్‌ స్టడీ్‌సకు సంబంధించిన ప్రతి పేపర్‌లో కనీసం 30 ముఖ్యమైన టాపిక్స్‌ గుర్తించి. ప్రిపేరైతే మంచి స్కోర్‌ సాధించవచ్చు.

    ఎస్సే పేపర్లో తాత్విక, అమూర్త అంశాలకు ఇస్తున్న ప్రాముఖ్యం కొనసాగవచ్చు. మొదటిసారి మెయిన్స్‌ రాసే అభ్యర్థులకు దీన్ని సమర్థంగా రాయడమే మొదటి సవాలు. అందుకని కనీసం రెండు మూడు పూర్తి స్థాయి ఎస్సే - మాక్‌ టెస్టులు రాయడం మంచిది.

    జనరల్‌ స్టడీస్‌ పేపర్ల విషయంలో క్రమశిక్షణ పాటించాలి. అంటే నిర్దేశిత సమయంలోపు జవాబులు రాయాలి. ప్రశ్నకు అనుగుణంగా సమాధానం ఉండాలి. అదనంగా ఏమి రాసినా జవాబుకు మరింత విలువను జోడించగలగాలి. ఒకటి అనుకుని మరొకటి రాయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

    మొదటి పేపర్‌ జాగ్రఫీ అండ్‌ సొసైటీలో డైనమిజానికి తోడు అప్లికేషన్‌ ఓరియెంటెడ్‌ ప్రశ్నలు రావచ్చు. జాగ్రఫీకి బదులు ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌, ప్రపంచ చరిత్ర, స్వాతంత్ర్యానంతర కాలంపై అదనంగా ఒక ప్రశ్న రావచ్చు. మ్యాప్స్‌ ప్రాక్టీసింగ్‌ను మర్చిపోవద్దు. సమకాలీనత జోడింపు అంటే రుతుపవనాలపై ఎల్‌నినో ప్రభావం ఎలా ఉందని అడగవచ్చు.

    జనరల్‌ స్టడీస్‌ రెండు, మూడు పేపర్లలో ఎక్కువగా సమకాలీన అంశాలపై ప్రశ్నలు అడగవచ్చు. పాలిటీ/గవర్నెన్స్‌ ఆర్టికల్స్‌, వాస్తవాలు, కేసు పేర్లు క్లిష్టంగా ఉంటాయి. చారిత్రాత్మకమని భావించే 20-30 కేసులతో ఒక బలమైన బ్యాంక్‌ను ఏర్పరుచుకోవాలి. అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి మోడీ అలాగే జయశంకర్‌ కోడ్స్‌తో అదనపు సమాచారాన్ని కలుపుకోవాలి. బడ్జెట్‌, ఎకనామిక్‌ సర్వేలో అడిగేవి డేటా నిర్దేశితంగా ఉంటాయని గమనించాలి.

    నాలుగోది ఎథిక్స్‌ పేపర్‌. గత ఏడాది మాదిరిగానే అప్లికేషన్‌/ హైబ్రిడ్‌ ప్రాతిపదికగా ఉంటుంది. పని సంస్కృతి, నైతిక వెర్సస్‌ ప్రవరన్తన నియమావళి వంటివే ఈసారీ అడగవచ్చు. కీలక పదాలు చాలా ముఖ్యం. ఈ పేపర్‌ ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందుకని సమయపాలన చాలా ముఖ్యం.

    సబ్జెక్టును బట్టి కొన్ని విషయాలకు ఇతోధిక ప్రాధాన్యం ఉంటుంది. అలా అనుకున్నప్పుడు హిస్టరీ - టైమ్‌లైన్స్‌, జాగ్రఫీ - మ్యాప్స్‌, సొసైటీ, అలాగే గవర్నెన్స్‌ - ఫ్లోచార్టులు, పాలిటీ - ఆర్టికల్స్‌, వాస్తవాలు, కేస్‌ పేర్లు; సోషల్‌ జస్టిస్‌ - డేటా, అంతర్జాతీయ సంబంధాలు - మ్యాప్స్‌, కోడ్స్‌, ఎకానమీ - బడ్జెట్‌, ఆర్థిక సర్వే డేటా, ఎథిక్స్‌ - కీలక పదాలు - పక్కాగా సమయపాలన ముడిపడి ఉంటాయి.

    ప్రతి రోజు టైమ్‌ టేబుల్‌లో తప్పనిసరిగా ఆప్షనల్‌ సబ్జెక్టు ఉండాలి. దానికి ఎక్కువ వెయిటేజ్‌ ఉంటుంది. గడచిన అయిదు నుంచి ఏడేళ్ళ ప్రశ్నపత్రాలను సంపూర్ణంగా అవగాహన చేసుకోవడమే కాదు, వాటని సాల్వ్‌ చేయాలి.

    ఉదయం జనరల్‌ స్టడీస్‌ మొదటి రెండు పేపర్లు, మధ్యాహ్నం మిగిలిన రెండు పేపర్లు రాయాలి. ఈ నెలాఖరు, వచ్చేనెల మొదటి వారంలో ఎక్కువ గంటలు రాసే విధంగా సన్నద్ధులు కావాలి. అలా మైండ్‌ని ట్యూన్‌ చేసుకోవాలి. పరీక్ష రోజు ఉండే వాతావరణానికి అనుగుణంగా ఎక్కువ మంది అభ్యర్థులు తయారు కారు. అదే అసలు పరీక్ష రోజున ఇబ్బందిని కలుగజేస్తుంది.

    నోట్స్‌కు ప్రాధాన్యం ఉంది. అయితే ఆఖరు రోజుల్లో రాయగలగడమే ముఖ్యం. రెగ్యులర్‌ విరామాలతో మూడేసి గంటలు కూర్చుని పరీక్ష రాయడాన్ని నేర్చుకోవాలి. అది ప్రతి రోజూ ఉండేలా అలవాటు చేసుకోవాలి.

    ఈసారి సృజనాత్మకత ఇతోధికపాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. నిర్దేశించిన సమయంలో ప్రశ్నలన్నింటికీ జవాబు రాయడం, ప్రశ్నకు అనుగుణంగా సమాధానం, సంబంధం ఉండేలా చూసుకోవడం ముఖ్యం. ఈ నేపథ్యంలో నాణ్యతే మహారాజు. అదే ర్యాంక్‌ను తెప్పిస్తుందని బలంగా నమ్మితీరాలి.

    ప్రతి పేపర్‌లో ఏ మేరకు స్కోర్‌ సాధించాలన్నది కూడా ముఖ్యమే. జనరల్‌ స్టడీస్‌ పేపర్ల్లు మూడింటిలో ఒక్కోదానిలో మార్కులు 100కి తగ్గకూడదు. ఎస్సే, ఎథిక్స్‌ ఒక్కోదానిలో కనీసం 120 సాధించాలి. ఆప్షనల్‌ రెండు పేపర్లలో కలిపి 270కి తగ్గకూడదు. మొత్తమ్మీద 810కి మించి స్కోర్‌ టార్గెట్‌ కావాలి. జనరల్‌ స్టడీస్‌ పేపర్లు - ఒక్కో దాంట్లో అదనంగా పది తెచ్చుకుంటే 30 మార్కుల వరకు పెంచుకోవచ్చు. అప్పుడే మంచి ర్యాంక్‌ లభిస్తుంది. అదనంగా సాధించే ప్రతి మార్కు ర్యాంక్‌ను, ఆపై సర్వీస్‌ కేటాయింపును ప్రభావపరుస్తుందన్న విషయం తెలిసిందే.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement