రాష్ట్రానికి పీఎం జన్‌మన్ అవార్డులు
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆదికర్మయోగి అభియాన్ జాతీయ సదస్సులో రాష్ట్రానికి మూడు అవార్డులు దక్కాయి. శుక్రవారం న్యూఢిల్లీని విజ్ఞాన్ భవన్లో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆదికర్మయోగి జాతీయ కాంక్లేవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి జన్‌మన్ ఆదికర్మయోగి అభియాన్ కింద ఉత్తమ పనితీరు కనరిచిన రాష్ర్టాలు, జిల్లాలు, మండలాలు, గ్రామస్థాయి అధికారులకు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రం నుంచి గిరిజన సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఎంఎం నాయక్, డైరెక్టర్ సదాభార్గవి ఈ అవార్డులను అందుకున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆది సహ్యోగి కింద చెట్టి శంకరరావు అవార్డు అందుకున్నారు. దార్తి ఆబా జన్ భగీధారి అభియాన్ కింద ఉత్తమ జిల్లాగా అల్లూరి సీతారామరాజు జిల్లా అవార్డును గెలుచుకుంది. అలాగే, కోట రామచంద్రాపురం ఐటీడీఏ ఉత్తమ ఐటీడీఏగా, ఉత్తమ స్టేట్ మాస్టర్ ట్రైనర్‌గా పార్వతీపురం ఏపీవో మురళీధర్ అవార్డులు అందుకున్నారు. దర్తీ అభాజన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్‌లో ప్రతిభ చూపిన నంద్యాల, అన్నమయ్య, పార్వతీపురం జిల్లాలకు కూడా ప్రశంసా పత్రాలను అందజేశారు.
Comments