రాష్ట్రంలోని బ్యాంకుల్లో డిపాజిట్లు 8.64 లక్షల కోట్లు
హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో (ఏప్రిల్-జూన్) రాష్ట్రంలోని బ్యాంకుల్లో డిపాజిట్లు రూ.23,883 కోట్లు పెరిగి రూ.8,64,312 కోట్లకు చేరాయి. అలాగే అడ్వాన్సులు రూ.12,021 కోట్లు పెరిగి రూ.10,93,382 కోట్లకు చేరుకున్నాయి. ఎస్‌ఎల్‌బీసీ సమావేశం సందర్భంగా తొలి త్రైమాసికంలో డిపాజిట్లు, రుణాల వివరాలను బ్యాంకర్లు ప్రకటించారు. ఈ త్రైమాసికంలో వివిధ సంక్షేమ పథకాల్లో భాగంగా ప్రజలకు పంపిణీ చేసిన వివరాలను కూడా బ్యాంకర్ల కమిటీ ప్రకటించింది. తొలి మూడు నెలల్లో స్వల్పకాలిక వ్యవసాయ రుణాలుగా రూ.17,577 కోట్లు అందివ్వగా.. మొత్తం లక్ష్యంలో ఇది 32.73 శాతంగా ఉంది. అలాగే వ్యవసాయ, అనుబంధ రంగాలకు పెట్టుబడి రుణాల కింద రూ.23,473 కోట్లు ఇవ్వగా.. మొత్తం లక్ష్యంలో ఇది 30.93 శాతం.
ప్రాధాన్యత రంగాల కింద గృహ రుణాలకు రూ.1,407 కోట్లు, ఉన్నత విద్యకు రూ.110 కోట్లు విడుదల చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎ్‌సఎంఈ) రూ.68,033 కోట్లు, వ్యాపారస్తులకు ముద్ర రుణాలు రూ.3,303 కోట్లు ఇచ్చారు. వ్యవసాయ మౌలికవసతుల అభివృద్ధికి రూ.5 వేల కోట్లు లక్ష్యంగా నిర్దేశించగా రూ.3,645 కోట్లు మంజూరు చేశారు. సామాజిక భద్రత పథకంలో భాగంగా.. ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకంలో 1.97 కోట్ల మందికి జీవిత బీమా కల్పిస్తున్నారు. ప్రధాన మంత్రి జీవనజ్యోతి బీమా యోజన 95.48 లక్షల మందికి అమల్లో ఉంది. అలాగే 24.21 లక్షల మంది అటల్ పెన్షన్ యోజన కింద రక్షణ పొందుతున్నారు.
Comments