విశాఖ ఆర్డీవో, డీఆర్వో వివాదం.. సర్కార్ కీలక నిర్ణయం
విశాఖపట్నం : ఆర్డీవో శ్రీలేఖ, డీఆర్వో భవానీ శంకర్ల మధ్య వివాదంపై ప్రభుత్వం స్పందిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్డోవో, డీఆర్వోలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు (సోమవారం) ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్డీవో, డీఆర్వో మధ్య విభేదాలతో వ్యవహారం రోడ్డెక్కగా.. గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. జాయింట్ కలెక్టర్కు డీఆర్వో బాధ్యతలు, డిప్యూటీ కలెక్టర్ హెచ్పీసీఎల్కు ఆర్డీవో బాధ్యతలను అప్పగించింది ప్రభుత్వం. వారిద్దరినీ విధుల నుంచి రిలీవ్ చేయాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆర్డీవో, డీఆర్వోలకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు ప్రభుత్వం.
కాగా... డీఆర్వో ప్రతి నెలా నిత్యావసర సరుకుల కోసం తహశీల్దారు కార్యాలయ సిబ్బందికి ఇండెంట్ పెడుతున్నారని ఇటీవల కలెక్టర్కు ఆర్డీవో శ్రీలేఖ ఫిర్యాదు చేశారు. ఈ విషయం కాస్తా లీక్ అవడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై అమరావతి నుంచి రెవెన్యూ ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు ఫోన్ చేసి వివరాలు అడిగినట్లు తెలుస్తోంది. గతఏడాదే ఇరువురు అధికారులు జిల్లాకు బదిలీపై వచ్చారు. మొదట్లో మంచిగానే ఉన్నప్పటికీ రానురాను ఇరువురి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.
ప్రోటోకాల్ విధులు ఆర్డీవో చూడాల్సి వస్తుందని.. కానీ ప్రోటోకాల్ విధుల విషయంలో తనకు చివరి నిమిషంలో సమాచారం ఇస్తున్నారని శ్రీలేఖ వాపోతున్నట్లు సమాచారం. కానీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల పేషీలకు ఆమె చాలాకాలం నుంచి దూరంగా ఉంటున్నారని సిబ్బంది చెబుతున్న పరిస్థితి. ఇదిలా ఉండగా.. తాజాగా తహశీల్దార్ కార్యాలయాల నుంచి డీఆర్వో ఇంటి సామగ్రి తెప్పించుకున్నట్లు ఆర్డీవో ఇచ్చిన ఫిర్యాదు వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఇద్దరు అధికారులపై ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
Comments