పక్కన పెట్టిన గత వైసీపీ సర్కారు.. శిథిలావస్థలో ఈ-ఆటో
నూజివీడు : చెత్త నుంచి సంపద సృష్టించాలన్న లక్ష్యంతో గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామంలోనూ చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఊరి బయట షెడ్లు నిర్మించి గ్రామంలో ఉత్పన్నమయ్యే తడి, పొడి చెత్తలను చెత్తసంపద కేంద్రాలకు తరలించి తద్వారా వర్మి కంపోస్టు తయారు చేసి పంట పొలాలను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో కోట్లాది రూపాయలను వెచ్చించింది. షెడ్ల నిర్మాణంతో పాటు ప్రతి గ్రామానికి చెత్తను తరలించేందుకు ఎలక్ట్రిక్ అటోలను పంచాయతీరాజ్ శాఖ కొనుగోలుచేసి ఆయా గ్రామాలకు అందించింది. అయితే ఆ కార్యక్రమం పట్టాలు ఎక్కక ముందే ప్రభుత్వం మారింది. గత వైసీపీ ప్రభుత్వం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను పక్కన పెట్టింది. దీంతో ఈ అటోలు మూలకు చేరి పనికి రాకుండా పోయాయి.
ఒక్కొక్క ఈ-ఆటో కొనుగోలుకు సుమారు రూ.ఐదు లక్షలకు పైబడి వెచ్చించారు. నూజివీడు నియోజకవర్గ పరిధిలో ఉన్న RM గ్రామాలకు గాను 62 గ్రామాలకు ఈ-ఆటోలను సరఫరా చేశారు. తడిచెత్త, పొడిచెత్తలను వేర్వేరుగా సమీకరించి చెత్తసంపద కేంద్రాలకు తరలించాల్సిన బాధ్యత ఈ ఆటోల నిర్వాహకుంది. సుమారు మూడున్నర కోట్ల రూపాయల వరకు ఖర్చు అవ్వగా తదనంతరం ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం ఈ ఆటోలను పట్టించుకోకుండా పక్కన పెట్టేసింది. మరోవైపు తడి చెత్త, పొడి చెత్తను గ్రామం నుంచి తరలించేందుకు రూ.16 లక్షలు ఖర్చు చేసి రిక్షాలను కొనుగోలు చేశారు.
వాస్తవంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఈ ఆటోలనే వినియోగంలోకి తీసుకొని వచ్చిఉంటే సంపద తయారీ కేంద్రాలను ఎప్పుడో గాడిలో పెట్టి. సంపద సృష్టించేందుకు అవకాశం కలిగేది. చెత్త సంపద కేంద్రాలకు ఉపయోగపడాల్సిన ఈ-ఆటోలు పూర్తిగా శిధిలమై చెత్తగా మారుతున్నా (స్క్రాప్) ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వాటికి పనికివచ్చే ఆటోలకు కాస్త మరమ్మతులు చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని, పనికిరాని వాటిని వేలం వేయడం ద్వారా ప్రజా ధనాన్ని దుర్వి నియోగం కాకుండా. కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
Comments