బాగా చదివితేనే ఉన్నత స్థానం – విద్యార్థినిలకు సూచించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
బాగా చదువుకోవడం ద్వారా సమాజంలో ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థినిలకు సూచించారు. ఇందుకుగాను రెగ్యులర్ గా పాఠశాలకు హాజరుకావాలని అన్నారు. శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా ,తిరుమలగిరి సాగర్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల హాజరు రిజిస్టర్ ను, అదేవిధంగా ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు.ఫేస్ రికగ్నిషన్ ఆప్ (ఎఫ్ ఆర్ ఎస్) ద్వారా ఆన్లైన్లో అటెండెన్స్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో మాట్లాడుతూ రెగ్యులర్ గా పాఠశాలకు హాజరవుతూ సబ్జెక్టు విషయాల పట్ల ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉండాలని అన్నారు. పాఠశాల నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పారిశుద్ధ్యం ,విద్యార్థినిల ఆరోగ్యం, భోజనం, తదితర అంశాల పట్ల ఏలాంటి సమస్యలు రాకుండా చూడాలని ప్రిన్సిపల్ ను ఆదేశించారు .
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ 9 వ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థినిలతో బయో సైన్స్ తోపాటు, వివిధ సబ్జెక్టులు, జనరల్ నాలెడ్జ్ పై ప్రశ్నలు అడిగారు. అంతేకాక పలు అంశాలపై అవగాహన కల్పించారు. బాగా చదువుకోవడం ద్వారా మంచి స్థానంలో ఉండొచ్చని, అంతేకాక విద్యార్థినిలు ఆర్థికంగా వారి కాళ్ళ పై వారు నిలబడవచ్చని, అప్పుడే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. అనారోగ్యానికి గురి కాకుండా మంచి ఆహారం తీసుకోవాలని, పరిశుభ్రత పాటించాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ,జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, కేజీబీవీ ప్రిన్సిపల్ కవిత, తదితరులు ఉన్నారు.




Comments