భారత్లో పౌర విమానాల తయారీ
న్యూఢిల్లీ : భారత్లోనే తొలిసారిగా పూర్తిస్థాయి ప్రయాణికుల విమానాలు తయారు కాబోతున్నాయి. రష్యాకు చెందిన యునైటెడ్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్ (యూఏసీ) సహకారంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్).. భారత్లోనే ఎస్జే-100 విమానాలను తయారు చేయనుంది. ఈ మేరకు ఇరు సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ట్విన్ ఇంజన్, న్యారో బాడీతో నిర్మించనున్న ఈ విమానాలు ఉడాన్ పథకం కింద స్వల్ప దూర ప్రయాణాలకు మరింత ఊతమివ్వనున్నాయని హాల్ మంగళవారం తెలిపింది. టైర్-2, టైర్-3 నగరాల మధ్య ప్రాంతీయ అనుసంధానం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో ఉడాన్ పథకాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 200కిపైగా ఎస్జే-100 విమానాలను 16 విమానయాన సంస్థలు నడుపుతున్నాయి. రష్యాకు చెందిన యూఏసీ వెబ్సైట్లో పొందుపరచిన వివరాల ప్రకారం ఎస్జే-100 చిన్న పరిణామం కలిగిన విమానం. దీనిలో 103 మంది ప్రయాణించవచ్చు. 3,530 కిలోమీటర్ల పరిధిలోని ప్రయాణాలకు ఇది అనుకూలంగా ఉంటుంది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నందున అమెరికా అదనపు సుంకాలు విధిస్తున్న తరుణంలో భారత్-రష్యా మధ్య ఈ కీలక ఒప్పందం కుదరడం గమనార్హం.









Comments