ఏడు నెలల పోరాటం తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా ‘జననాయగన్’ ఫీవర్
కోలీవుడ్ అగ్రహీరో, టీవీకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ .. 7 నెలల పోరాటం తర్వాత నేడు ప్రపంచ వ్యాప్తంగా సినిమా థియేటర్లలోకి వచ్చింది. దాదాపు 3500కు పైగా స్క్రీన్లపై ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఒక్క తమిళనాడులోనే 950-1000 థియేటర్లలో విడుదలవుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత వెంకట్ కె.నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకుడు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9న విడుదలకావాల్సిన ఈ మూవీ సెన్సార్ వివాదంలో చిక్కుకుంది. సెన్సార్ వివాదం, న్యాయ పోరాటం, రాజకీయ అడ్డంకులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, సినిమాలోని కీలక సన్నివేశాల లీక్ వంటి పలు అడ్డంకులను అధిగమించి.. ఈనెల 23న గురువారం విడుదలవుతోంది. ‘ఎ’ సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర జర్నీని పరిశీలిస్తే...
‘ది గోట్’ మూవీ తర్వాత..
వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘ది గోట్’ చిత్రం విడుదలై ఘన విజయం సాధించిన తర్వాత విజయ్ తన 69వ చిత్రాన్ని హెచ్. వినోద్ దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించారు. ఈ చిత్రాన్ని 2024 సెప్టెంబరు 24న అధికారికంగా ప్రకటించారు. వర్కింగ్ టైటిల్‌గా ‘దళపతి-69’గా పెట్టి 2024 అక్టోబరులో సెట్స్‌పైకి తీసుకెళ్లారు. పూజా హెగ్డే, మమితా బైజు, ప్రియమణి, ప్రకాష్ రాజ్, బాబీ డియోల్ వంటి ప్రముఖ నటీనటులు నటించారు. 2025 జనవరిలో ఈ చిత్రానికి ‘జననాయగన్’ నామకరణం చేసి, 2026 జనవరి 9న సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో 2026 అక్టోబరులో చిత్రీకరణ పూర్తి చేసుకోగా, డిసెంబరులో సెన్సార్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
మలేషియాలో ఆడియో రిలీజ్...
పోస్ట్ ప్రొడక్షన్ నిర్మాణ పనులు పూర్తి చేసిన తర్వాత 2025 డిసెంబరులో మలేషియా వేదికగా లక్షమందికి పైగా అభిమానుల సమక్షంలో ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయ్ చివరి చిత్రం కావడంతో వేడుకకు భారీ సంఖ్యలో హాజరయ్యారు. దీంతో అత్యధిక మంది హాజరైన ఆడియో రిలీజ్ వేడుకగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ‘సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్టు ఈ వేడుకలో విజయ్ ప్రకటించారు. ఇది విజయ్ అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకులను కదిలించింది.










Comments