కడపలో ‘సర్కిల్’ రచ్చ!
కడప : కడప నగరంలోని అల్మాస్‌పేట సర్కిల్ పేరు మార్పు వివాదానికి దారితీసింది. ఎన్నో ఏళ్ల నుంచి అల్మాస్‌పేట సర్కిల్‌గా పిలుచుకుంటున్న ఈ ప్రాంతానికి టిప్పుసుల్తాన్ సర్కిల్‌గా నామకరణం చేయాలని ఓ వర్గం డిమాండ్ చేస్తోంది. ఈ సర్కిల్ పక్కనే ఉన్న ఆంజనేయస్వామి గుడి వద్ద 31 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. హనుమజ్జయంతి సందర్భంగా 12న విగ్రహ ప్రతిష్ఠ చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో హనుమాన్ సర్కిల్ అని రాయడం వివాదానికి కారణమైంది. శనివారం ఉదయం 9.30 గంటలకు ఇరువర్గాలు పోటాపోటీగా ఆందోళనలు ప్రారంభించాయి. మాజీ ఎమ్మెల్సీ పుత్తా న రసింహారెడ్డి, టీడీపీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు భూపేశ్‌రెడ్డి, మైనార్టీ నేత ముక్తియార్ ఇరువర్గాల మధ్య చర్చలు జరిపారు. టిప్పుసుల్తాన్ బదులు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు పెట్టాలని, లేకుంటే అల్మాస్పేటగానే కొనసాగించాలని ఓ వర్గం డిమాండ్ చేసింది. అయితే టిప్పుసుల్తాన్ పేరు ఉంచాలని మరో వర్గం పట్టుబట్టింది. చర్చలు జరుగుతుండగానే మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఇరు వర్గాలు రాళ్లతో దాడికి తెగబడ్డాయి. ఈ దాడిలో తాలుకా సీఐ నరసింహరాజు తలకు గాయం కావడంతో కుప్పకూలిపోయారు. మరికొందరికి కూడా గాయాలయ్యాయి. దీంతో ఇన్చార్జి డీఎస్పీ బాలస్వామిరెడ్డి, పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి, అక్కడి ఫ్లెక్సీలను తొలగించి 144 సెక్షన్ విధించారు. దాడులకు దిగిన అరాచకశక్తులపై చర్యలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కోరారు.
పేరు మార్చాలని కోరలేదు: కలెక్టర్
అల్మా్‌సపేట సర్కిల్ పేరు మార్చాలని అధికారికంగా ఎలాంటి రికార్డులు కాని, వినతులు కానీ లేవని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. నగర పాలకసంస్థలో కూడా ఎలాంటి ప్రతిపాదన కానీ, ఆమోదం కానీ లేవని శనివారం రాత్రి అన్నిమతాల పెద్దలతో కలెక్టరేట్లో జరిగిన శాంతి కమిటీ సమావేశంలో స్పష్టం చేశారు. మతసామరస్యాన్ని దెబ్బతీసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.










Comments