ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి ఉగ్రదాడి ముప్పు.. అప్రమత్తమైన పోలీసులు..
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీల భవనాలపై ఉగ్రదాడి జరిగే అవకాశం ఉండడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం సహా ప్రభుత్వ కార్యాలయాలపై ఉగ్రదాడి జరగవచ్చన్న పక్కా సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు రాజధాని వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం, ప్రభుత్వ కీలక కార్యాలయాల వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
పాకిస్థాన్‌తో సంబంధాలున్న గ్యాంగ్‌స్టర్ షాజాద్ భట్టి నెట్‌వర్క్‌కు చెందిన తొమ్మిది మందిని గురువారం నాడు పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వారి అరెస్టు అనంతరం ఉగ్రదాడి గురించి స్పెషల్ సెల్‌కు సమాచారం అందింది. దాడి కోసం నిందితులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొంతమందిని నియమించుకున్నారని.. ఉత్తర భారతదేశం, ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిపై కాల్పులు జరపాలని వారికి ఆదేశాలు అందినట్లు స్పెషల్ సెల్ అదనపు పోలీసు కమిషనర్ ప్రమోద్ సింగ్ కుష్వాహ్ తెలిపారు. వారిలో కొందరు షాజాద్ భట్టి నెట్‌వర్క్ కోసం ఆయుధాలను అక్రమ రవాణా కూడా చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
'బీజేపీ ప్రధాన కార్యాలయం, సమీపంలోని ప్రభుత్వ కార్యాలయాలపై ఉగ్రదాడి జరగవచ్చని సమాచారం అందింది. గతేడాది రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగిన కారు బాంబు ఘటన నేపథ్యంలో ఆత్మాహుతి దాడులు, కారు బాంబులు, ఆయుధాలు, ఐఈడీల అంశాలపై దర్యాప్తు ప్రారంభించాం' అని మరో సీనియర్ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో అధికారులు హై అలర్ట్ ప్రకటించి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.










Comments