• May 26, 2026
  • NPN Log

    షాద్‌నగర్‌ : అతని పేరు బండారి యాదగిరి. తెలుగుదేశం పార్టీ అంటే హద్దులు లేని వల్లమాలిన అభిమానం! ఎంతలా అంటే.. తెలంగాణలో టీడీపీ అధికారంలోకి రావాలన్న ఆకాంక్షతో పెళ్లి కూడా చేసుకోకుండా, నిత్యం పార్టీ కోసమే పనిచేసే అంత!! పార్టీపై అభిమానంతో.. ఒకరకంగా చెప్పాలంటే పిచ్చితో... తన ఇల్లు, బైక్‌ను కూడా పసుపుమయం చేసేశాడు. ఒంటిపై చంద్రబాబు, లోకేశ్‌తో పాటు సైకిల్‌ చిత్రాలను కూడా పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. టీడీపీ సేవకే తన జీవితం అంకితం అని అంటున్నాడు!! వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని వనపర్తి జిల్లా ఖిలాఘణాపూర్‌ మండల కేంద్రానికి చెందిన బండారి యాదగిరి టీడీపీకి వీరాభిమాని. గత 25 ఏళ్ల నుంచి పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాడు. ఆయన శనివారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో నిర్వహించిన మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థాయి టీడీపీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. పార్టీపై ఉన్న వీరాభిమానంతో ఇల్లు, బైక్‌ను పసుపు రంగుగా మార్చుకుని, పార్టీ కోసమే కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడని తెలుసుకున్న టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు.. యాదగిరిని వేదికపైకి పిలిచి, సన్మానించి, అభినందించారు. ఈ సందర్భంగా యాదగిరి విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణలో టీడీపీ అధికారంలోకి రావాలనే ఆకాంక్షతో పెళ్లికి దూరంగా ఉంటూ, ప్రతి రోజూ పార్టీ కోసం ప్రయాణం చేస్తున్నానని తెలిపారు. గతంలో రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ప్రస్తుతం ఎస్‌.రవీందర్‌ చేస్తున్న ఆర్థిక సహకారంతో నిత్యం పార్టీ కోసం పనిచేస్తున్నానని చెప్పారు. రెండేళ్ల క్రితం కుడి చేతిపై చంద్రబాబు, సైకిల్‌ చిత్రాలను పచ్చబొట్టుగా వేయించుకున్నానని, రెండు నెలల క్రితం గుండెలపై కూడా చంద్రబాబుతో పాటు లోకేశ్‌ చిత్రాల పచ్చబొట్లు వేయించానని యాదగిరి తెలిపారు.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement