బాల్య వివాహాలను అరికట్టడం అందరి బాధ్యత అంగన్వాడీ టీచర్లకు సెక్టార్ సమావేశం అవగాహన కల్పించిన ఉరవకొండ ప్రాజెక్ట్ సీడీపీఓ డాక్టర్ బి.ఎన్. శ్రీదేవి
విడపనకల్లు (ఈనాడు): బాల్య వివాహాలను నిరోధించి, చిన్నతనంలోనే పిల్లల్లోని శారీరక, మానసిక లోపాలను గుర్తించి అంగన్వాడీ కార్యకర్తలు వారికి మంచి భవిష్యత్తును అందించాలని ఉరవకొండ ప్రాజెక్ట్ సీడీపీఓ డాక్టర్ బి.ఎన్. శ్రీదేవి పిలుపునిచ్చారు. విడపనకల్లు మండల కేంద్రంలో గురువారం అంగన్వాడీ టీచర్లందరికీ ప్రత్యేక సెక్టార్ సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీడీపీఓ శ్రీదేవి మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల టీనేజ్ గర్భధారణ, తీవ్ర రక్తహీనత, గర్భస్రావం (అబార్షన్) వంటి గంభీర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. అంతేకాకుండా పుట్టబోయే పిల్లలు తీవ్ర తక్కువ బరువు, తక్కువ ఎత్తుతో జన్మించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వివరించారు.
ప్రతిజ్ఞ చేసిన అంగన్వాడీలు
మన గ్రామాల్లో ఎక్కడా బాల్య వివాహాలు జరగకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేస్తూ, ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లతో ప్రతిజ్ఞ చేయించారు. పిల్లలకు సకాలంలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం ద్వారా వారిలో ఉన్న లోపాలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స అందించి, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయవచ్చని ఆమె సూచించారు.
ఈ సమావేశంలో సూపర్వైజర్లు ఎన్. విజయ కుమారి, బి. పుష్పావతి, హెచ్. పద్మలతో పాటు మండల పరిధిలోని అంగన్వాడీ ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.










Comments