• May 26, 2026
  • NPN Log

    మంగళ్‌హాట్‌ : హైదరాబాద్‌లో శనివారం ఉదయం ఓ న్యాయవాదిని కారుతో గుద్ది చంపేశారు. నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ హత్య జరిగింది. ఇంటి బయట ఉన్న కారు ఎక్కుతుండగా ఆయనను ఓ కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టడం, ఆయన అంతదూరంలో ఎగిరిపడటం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. మాసబ్‌ట్యాంక్‌ ప్రాంతంలో నివాసం ఉండే ఖాజా మొహియుద్దీన్‌(63) న్యాయవాది. సిటీ సివిల్‌ కోర్టులో పనిచేస్తున్నారు. హైకోర్టులోనూ అడ్వకేట్‌గా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. తన మామ అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉండటంతో ఆయన్ను చూసేందుకు వెళ్లడానికి మొహియుద్దీన్‌ శనివారం ఉదయం 6గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఆయన కారు ఎక్కబోతున్న క్రమంలో అప్పటికే అక్కడ కాచుకుని ఉన్న దుండగులు కారులో వేగంగా వచ్చి మొహియుద్దీన్‌ను ఢీకొట్టారు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ మొహియుద్దీన్‌ను కుటుంబసభ్యులు వెంటనే అబిడ్స్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మొహియుద్దీన్‌ చనిపోయారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఆయన మృతదేహానికి ఉస్మానియా ఫోరెన్సిక్‌ విభాగం వైద్యులు శవపరీక్షలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నాంపల్లి పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఐదు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతం, మాసబ్‌ ట్యాంక్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

     

     

    కాంగ్రెస్‌ నాయకుడిపై ఆరోపణలు

    రాష్ట్రంలో వక్ఫ్‌బోర్డ్‌ భూములను ఆక్రమించిన కాంగ్రెస్‌ నాయకుడు ముజాహిద్‌ ఆలంఖాన్‌, మహబూబ్‌ ఆలంఖాన్‌లే తన తండ్రిని చంపించారని మొహియుద్దీన్‌ కుమారుడు ఫర్హాన్‌ ఆరోపించారు. ‘‘నవాబ్‌షా ఇంజనీరింగ్‌ కాలేజ్‌, అన్వర్‌ ఉల్‌ ఉలూం వక్ఫ్‌, ముంతాజ్‌ యావిద్దుల వక్ఫ్‌ వంటి ఆస్తులు వక్ఫ్‌ బోర్డుకు సంబంధించినవి. వాటిని ఆక్రమించడంతో కొన్నేళ్లుగా మా నాన్న న్యాయస్థానం ద్వారా పోరాడుతున్నారు. అప్పటి నుంచి బెదిరింపులు మొదలయ్యాయి. ఇప్పటి వరకు ఆరుసార్లు మా తండ్రిపై దాడి చేశారు. ఇటీవలే మా ఆఫీసుకు వచ్చి నన్ను కూడా ఆలంఖాన్‌ బెదిరించాడు. రూ.10 కోట్లు ఇస్తామని, కేసు నుంచి తప్పుకోమని ప్రలోభ పెట్టారు. వినకపోవడంతో గతంలో కార్యాలయంపై దాడి చేశారు. ఇందుకు సంబంధించి పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. మా నాన్నను కారుతో ఢీకొట్టి చంపించింది కాంగ్రెస్‌ నాయకుడు ఆలంఖానే. ఇప్పటికీ నాకు, నా కుటుంబ సభ్యులకు ముజాహిద్‌ ఆలంఖాన్‌ నుంచి ప్రాణహాని ఉంది. ప్రభుత్వం మాకు రక్షణ కల్పించాలి’’ అని ఫర్హాన్‌ విజ్ఞప్తి చేశారు.

    గతంలో హత్యాయత్నం, దాడులు

    ఖాజా మొహియుద్దీన్‌ పలు వక్ఫ్‌బోర్డ్‌ భూములతో పాటు ఇతర భూములకు సంబంధించిన కేసులు వాదిస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. వక్ఫ్‌బోర్డ్‌ భూముల విషయంలో మలక్‌పేట్‌లో తనపై హత్యాయత్నం జరిగినట్లు మొహియుద్దీన్‌ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గతంలో దాడికి యత్నించిన వారే ఈ హత్య కేసులో నిందితులై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, మొహియుద్దీన్‌ హత్య విషయం తెలిసి మాసబ్‌ట్యాంక్‌లోని ఆయన ఇంటికి, ఉస్మానియా మార్చురీ వద్దకు పలువురు న్యాయవాదులు వచ్చారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement