• May 26, 2026
  • NPN Log

    సూర్యాపేటక్రైం : సూర్యాపేట జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడు ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. సూర్యాపేట మండలం ఎర్కా రం గ్రామ మాజీ సర్పంచ్‌ భర్త, బీఆర్‌ఎస్‌ నాయకుడు చింతలపాటి మధు(45)ను గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డళ్లతో నరికి చంపారు. ఆపై మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి సమీపంలోని ఎస్సారెస్పీ కాల్వలో పడేశారు. పాత కక్షలే ఈ హత్యకు కారణమని అనుమానాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎర్కారం గ్రామానికి చెందిన చింతలపాటి మధుకు భార్య మౌనిక, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మౌనిక 2019-2023 వరకు ఎర్కారం సర్పంచ్‌గా పని చేశారు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి సూర్యాపేటలోని బాలాజీనగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న మధు.. పనుల ప్రకారం ఎర్కారం వెళ్లి వస్తుంటారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన మధు.. వివిధ పనుల అనంతరం సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లి సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. ఆ సమయంలో మధుకు సమీప బంధువైన ఎర్కారం సమీప గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. మధుకు ఫోన్‌ చేసి పార్టీ చేసుకుందామని తమ ఇంటికి ఆహ్వానించినట్టు తెలిసింది. సూర్యాపేటలోని తాళ్లగడ్డలో ఉన్న ఆ బంధువు ఇంటికి వెళ్లిన మధు.. పార్టీ అనంతరం అక్కడే నిద్రించారు. అయితే, ఆ సమీప బంధువుతోపాటు మరికొందరు వ్యక్తులు గొడ్డళ్లతో మధుపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో మధు మెడ, తల, భుజం భాగాల్లో తీవ్ర గాయాలవ్వగా.. అక్కడికక్కడే మరణించాడు. అనంతరం సదరు వ్యక్తులు మధు మృతదేహాన్ని గోనె సంచిలో మూటగట్టి వాహనంలో తరలించారు. మధు మృతదేహాన్ని సూర్యాపేట-జనగాం రోడ్డులో ఎర్కారం గ్రామ స్టేజీ సమీపంలోని ఎస్సారెస్పీ కాల్వలో పడేశారు. మధు ద్విచక్రవాహనాన్ని, మొబైల్‌ ఫోన్‌ను బాలెంల స్టేజీ సమీపంలో రోడ్డు పక్కన పడవేశారు. మరోపక్క, భర్త ఇంటికి తిరిగి రాకపోవడంతో మధు భార్య మౌనిక శుక్రవారం రాత్రి సూర్యాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు శనివారం తెల్లవారుజామున మధు మృతదేహాన్ని గుర్తించారు. కాగా, 2007లో ఎర్కారం మాజీ సర్పంచ్‌, కాంగ్రెస్‌ నాయకుడు మిద్దె రవీందర్‌ హత్య కేసులో మధు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. దీంతో రవీందర్‌కు సంబంధించిన వారే పాత కక్షల నేపథ్యంలో మధును హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. కాగా, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్‌ తదితరులు మధు మృతదేహానికి నివాళులర్పించారు.

     

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement