• May 26, 2026
  • NPN Log

    న్యూఢిల్లీ : జాతీయ పంచాయతీ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌ ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా కుప్పం పంచాయతీ జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర కీర్తిని ఇనుమడింపజేసింది. కేంద్ర పంచాయతీ రాజ్‌ శాఖ శనివారం ప్రకటించిన ‘జాతీయ పంచాయతీ అవార్డులు-2025’లో ఏపీకి మొత్తం ఐదు అవార్డులు దక్కాయి. దేశవ్యాప్తంగా 17 రాష్ర్టాలు/కేంద్రపాలిత ప్రాంతాలు సత్తా చాటగా, ఏపీ మొత్తం 5 అవార్డులు దక్కించుకోవడం గమనార్హం. జూన్‌ 3న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ తెలిపింది. ‘సుపరిపాలన’ విభాగంలో విశాఖపట్నం జిల్లా నాథవరం మండలం శృంగవరం గ్రామ పంచాయతీ దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొదటి ర్యాంకును సాధించింది. ప్రజలకు మెరుగైన ేసవలు అందించడంలో ఈ పంచాయతీ దేశానికే ఆదర్శంగా నిలిచింది. దీంతో ‘శృంగవరం’ పంచాయతీకి కేంద్ర ప్రభుత్వం రూ.కోటి నగదు పురస్కారాన్ని ప్రకటించింది. మహిళా సంక్షేమం, మహిళా స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించడంలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ‘బొక్కసంపాలెం’ పంచాయతీ దేశంలోనే ప్రథమ స్థానాన్ని కైవశం చేసుకుంది. మహిళల అభివృద్ధికి చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలకు గుర్తింపుగా రూ.కోటి నగదు బహుమతిని కూడా ఈ పంచాయతీ దక్కించుకుంది. ‘పేదరిక నిర్మూలన’ విభాగంలో కడప జిల్లా ఖాజీపేట మండలం ‘చెముళ్లపల్లి’ పంచాయతీ దేశంలోనే రెండో ర్యాంకు సాధించి, రూ.75 లక్షల నగదు బహుమతి దక్కించుకుంది. ‘ఉత్తమ బ్లాక్‌ పంచాయతీ’ విభాగంలో ‘కుప్పం’ దేశంలోనే మూడవ ర్యాంకు సాధించి రూ.1.50 కోట్ల పురస్కారాన్ని పొందింది. ‘మౌలిక సదుపాయాల’ విభాగంలో ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ‘గుండమాల’ పంచాయతీ 3వ ర్యాంకు సాధించి, రూ.25లక్షల నగదు బహుమతిని దక్కించుకుంది.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement