• May 26, 2026
  • NPN Log

    చిత్తూరు : ఈ ఆర్థిక సంవత్సరంలో రైతాంగానికి ఇతోధికంగా సేవలు అందించాలని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నిర్ణయించింది. ఈక్రమంలోనే టర్నోవర్‌ లక్ష్యాన్ని రూ. 4415 కోట్లుగా నిర్దేశించినట్లు బ్యాంకు చైర్మన్‌ అమాస రాజశేఖర్‌రెడ్డి చెప్పారు. శనివారం బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వివిధ రూపాల్లో రైతాంగానికి గత ఏడాది రూ.4వేల కోట్ల మేర రుణాలిందించాలని లక్ష్యం పెట్టుకోగా రూ.3887.13 కోట్లు అందించామన్నారు. డిపాజిట్ల రూపేణా గత ఏడాది రూ.1250 కోట్ల లక్ష్యానికి గాను రూ.1155.38 కోట్లు సేకరించామన్నారు. ఈ ఏడాది రూ.1400 కోట్ల మేర డిపాజిట్ల సేకరించాలని నిర్దేశించుకున్నామన్నారు. అడ్వాన్సుల పేరుతో రూ.3435 కోట్లు రుణాలివ్వనున్నట్లు చెప్పారు. అత్యవసర రుణాల రూపేణా రైతులను ఆదుకునేందుకు గత ఏడాది బంగారంపై రుణాలు రూ. 1050 కోట్లు పంపిణీ చేయగా ఈఏడాది రూ.1200 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.825 కోట్లు, ఇతర ప్రాధాన్యత రంగాలకు రూ 1390 కోట్లు రుణాల రూపేణా అందిస్తామన్నారు. తమ బ్యాంకుపై నమ్మకంతో ఖాతాదారులు షేర్‌ క్యాపిటల్‌గా రూ.97 కోట్లు చెల్లించగా ఈఏడాది రూ.127 కోట్లకు పెంచనున్నట్లు రాజశేఖర్‌ రెడ్డి తెలిపారు. బ్యాంకు ఉద్యోగుల నిరంతర కృషితో 2024-25లో రూ.9.35కోట్లు లాభం గడించగా గత ఏడాది దీన్ని రూ.24.95 కోట్లు వచ్చిందన్నారు. ఈఏడాది రూ.30 కోట్ల మేర లాభార్జన చేయాలనుకుంటున్నామన్నారు. ఉమ్మడి జిల్లాలోని 75 సింగిల్‌ విండోల ద్వారా వ్యవసాయ, స్వల్పకాలికేతర, గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణాలకు, బంగారంపై రుణాలు, ఇతరత్రా వాటి కోసం గత ఏడాది రూ. 51కోట్లు మంజూరు చేశామన్నారు. రుణ వితరణ మరింత పెంచే ధ్యేయంతో ఈ ఏడాది లక్ష్యాన్ని రూ.200 కోట్లుగా నిర్ణయించినట్లు చెప్పా రు. స్వయం సహాయక సంఘాలకు రూ.200 కోట్లు రుణాలుగా ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. మొలకలచెరువు, కలికిరి, గుర్రంకొండ, తిరుపతి నగరం, ఏర్పేడు మండలం పళ్లంలో కొత్త శాఖలు ప్రారంభించేందుకు ఆప్కాబ్‌కు ప్రతిపాదనలు పంపామని చెప్పారు. సమావేశంలో బ్యాంకు సీఈవో శంకర్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement