• May 26, 2026
  • NPN Log

    ఓ చిన్న పొరపాటు రాష్ట్రానికి తీవ్రంగా నష్టం చేకూర్చేలా ఉంది. బొగ్గురకం గుర్తింపులోని ఆ పొరపాటు రాష్ట్ర గనుల శాఖకు రూ. 300 కోట్ల ఆర్థిక భారాన్ని మిగిల్చే పరిస్థితి కనిపిస్తోంది. జరిగిన తప్పును సరిదిద్దడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. వివరాల్లోకి వెళ్తే, మధ్యప్రదేశ్‌లోని సులియారీలో ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి బొగ్గు నిక్షేపాలున్నాయి. అక్కడ మైనింగ్‌, నిర్వహణ బాధ్యతలను అదానీ పవర్‌ గ్రూప్‌ దక్కించుకుంది. టెండర్లకన్నా ముందే సులియారీ బ్లాక్‌లో ఉన్న బొగ్గు జీ6 గ్రేడ్‌ అని నిపుణులు చెప్పారు. ఇదే గ్రేడ్‌తో అదానీ గ్రూప్‌నకు టెండర్‌ కట్టబెట్టారు. అయితే ఆ తర్వాత కోల్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీసీవో) అక్కడున్న బొగ్గు రకాన్ని జీ7 గ్రేడ్‌గా నిర్ధారించింది. ఇది ఏపీఎండీసీని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. అక్కడున్నది జీ6 గ్రేడ్‌ అని టెండర్‌ కట్టబెట్టడం వల్ల తమపై రూ. 300 కోట్ల భారం పడుతోందని అదానీ గ్రూప్‌ చెబుతోంది. ఈ సమస్యను ఏపీఎండీసీనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆ భారం ఏపీ సంస్థే భరించాలని అదానీ సంస్థ తెగేసి చెప్పింది. ఇది ఎండీసీకి సంకటంగా మారింది. సులియారీ బొగ్గును జీ6గానే ప్రకటించాలని ఏపీఎండీసీ అనేక మార్లు సీసీవోకు విజ్ఞప్తి చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకొని సీసీవోకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ఏపీ సర్కారు కేంద్రానికి పలు దఫాలుగా లేఖలు రాసింది. అయినా ఇటు కేంద్రంలో, అటు సీసీవోలో స్పందన లేదు. అసలు సీసీవో ఉద్దేశం ఏమిటి? అది ఏ ప్రాతిపదికన సులియారీ బొగ్గును జీ7 గా నిర్ధారించిందో తెలుసుకునేందుకు ఏపీఎండీసీ చివరకు ఆర్‌టీఐ అస్త్రాన్ని కూడా ఉపయోగించింది. అయినా కూడా సీసీవో స్పందించ లేదు.

     

    ఏపీఎండీసీ విన్నపాలు, లేఖలకు సీసీవో స్పందించడం లేదని గుర్తించి అదానీ పవర్‌ న్యాయపరమైన చ ర్యలు ప్రారంభించింది. సులియారీ బొగ్గు గ్రేడ్‌ నిర్ణయంలో తప్పు వల్ల వచ్చే 300 కోట్ల భారం ఏపీఎండీసీనే భరించాలని, దీన్ని వివాద అంశంగా పరిగణించాలని అదానీ పవర్‌ డిస్ప్యూట్‌ నోటీసు జారీ చేసింది. ఈ వివాదం ముదరకుండా ఉండేందుకు ఏపీ గనులశాఖ, ఎండీసీ అధికారులు అదానీ పవర్‌తో సంప్రదింపులు ప్రారంభించారు. చర్చలతో సమస్యను పరిష్కరించుకుందామని ఆ సంస్థకు అధికారులు ఆఫర్‌ చేస్తూ గత మార్చిలో చర్చలు జరిపారు. కానీ ఆ చర్చలు ఆశాజనకంగా సాగలేదు. మరో దఫా సమావేశమై చర్చించాలని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఈ రెండో దఫా చర్చలు కూడా ఫలించకపోతే ఆ అదనపు భారాన్ని ఏపీఎండీసీనే భరించాలనే డిమాండ్‌పై అదానీ పవర్‌ ఆర్బిట్రేషన్‌కు వెళ్లే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి.

    సర్కారుముందున్న కర్తవ్యం

    అదానీ పవర్‌ ఏపీఎండీసీకి జారీచేసిన డిస్ప్యూట్‌ నోటీసును పరిష్కరించుకోవడానికి రెండు మార్గాలు కనిపిస్తున్నాయి. సులియారీలో ఉన్న బొగ్గు జీ6 గ్రేడ్‌ అని సీసీవోనే తన ఉత్తర్వులను సరిదిద్దాలి. లేదంటే, సీసీఓపైనే ఏపీఎండీసీ న్యాయపోరాటం చేయాలి. ఈ రెండింట్లో ఏదీ సాధ్యం కాకున్నా ఏపీఎండీసీ ఆ 300 కోట్ల అదనపు భారాన్ని మోయాల్సి ఉంటుంది. ఈవిషయంలో సర్కారు జోక్యం చేసుకోవాలని ఏపీఎండీసీ కోరుతోంది. కేంద్రంతో మాట్లాడి సీసీవో ఉత్తర్వులు మార్చేలా ఒత్తిడి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును గనుల శాఖ కోరుతోంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement