• May 26, 2026
  • NPN Log

    మార్కాపురం : వాహనదారులకు డ్రైవింగ్‌ టెస్ట్‌ నిర్వహించి నెగ్గిన తరువాత వారికి రవాణాశాఖ డీఎల్‌ (డ్రైవింగ్‌ లైసెన్స్‌) మంజూరు చేస్తుంది. ఈ సమయంలో లైసెన్స్‌ ఫీజుతోపాటు క్యూఆర్‌ కోడ్‌తో కూడిన కార్డుల జారీ కోసమంటూ ప్రతి లైసెన్స్‌ హోల్డర్‌ నుంచి రూ.235 వసూలు చేస్తోంది. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, హెవీ వాహనాలు కొనుగోలు చేసినవారు ఆర్‌సీ (రిజిస్ర్టేషన్‌ సర్టిఫికెట్‌) కోసం ఫీజు చెల్లిస్తున్నారు. కానీ 2023 ఆగస్టు నుంచి ఇప్పటివరకు అంటే దాదాపు 33 నెలలపాటు కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. జిల్లాలో 76 వేల కార్డులు పెండింగ్‌లో ఉండిపోయాయి. గత వైసీపీ హయాంలో ప్లాస్టిక్‌ కార్డులు ఇస్తామని.. వాహనదారులకు, లైసెన్స్‌ హోల్డర్‌లకు నేరుగా పోస్టు ద్వారా ఇంటికి పంపిస్తామని చెప్పారు. ఇందుకోసం రూ.235 రుసుం కూడా వసూలు చేశారు. కానీ కాంట్రాక్టరుకు నగదు చెల్లించని కారణంగా కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తరువాత కొంతకాలం వాహనదారుల వద్ద కార్డుల కోసం ఫీజు వసూలు చేయడం నిలిపివేశారు. 2024లో ప్రజా అధికారంలోకి వచ్చాక కార్డుల జారీపై కసరత్తు ప్రారంభించింది. మళ్లీ వాహనదారుల వద్ద నుంచి రుసుం వసూలు చేయడం ప్రారంభించింది. కానీ కార్డుల జారీ విషయం కొలిక్కి రాలేదు. కార్డులు నిలిచిపోయినప్పటి నుంచి కావలసినవారు ఆన్‌లైన్‌లో ఉన్న సర్టిఫికెట్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని రవాణాశాఖ అధికారులు చెప్పారు. అప్పటి నుంచి వాహనదారులు ఆన్‌లైన్‌ కాగితాలతోనే సరిపెట్టుకుంటున్నారు.

    డీఎల్‌, ఆర్‌సీ కార్డుల కోసం 2023 ఆగస్టు నుంచి ఇప్పటివరకు ఎదురుచూస్తున్న వారు జిల్లాలో దాదాపు 76 వేల మంది ఉన్నట్టు రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో సగటున ప్రతిరోజూ 30 మంది డ్రైవింగ్‌ లైసెన్స్‌ల కోసం, 50 వాహనాలు రిజిస్ర్టేషన్‌ కోసం వస్తుంటాయి. ఈ లెక్కన గడచిన 33 నెలల్లో దాదాపు 28వేల డీఎల్‌ కార్డులు, 48వేల ఆర్‌సీ కార్డులు జారీ కాకుండా పెండింగ్‌లో ఉండిపోయాయి. రుసుం వసూలు చేసి కూడా కార్డుల జారీ చేయకపోవడాన్ని ప్రజలు నిరసిస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం కార్డుల జారీకి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

     

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement