• May 26, 2026
  • NPN Log

    తిరుపతి  : తిరుపతిలో వేడుకగా జరుగుతున్న తాతయ్యగుంట గంగమ్మ జాతరను పురస్కరించుకుని టీటీడీ శనివారం సారెను సమర్పించింది. వెంకటేశ్వరస్వామి చెల్లెలిగా ప్రసిద్ధికెక్కిన గంగమ్మకు యేటా జాతర సందర్భంగా సారె సమర్పించడం అనవాయితీగా వస్తోంది.అందులో భాగంగా శనివారం సాయం త్రం తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను గోవిందరాజులస్వామి ఆలయానికి తీసుకొచ్చారు. ఇక్కడ పుండరీకవల్లి అమ్మవారి ఆలయంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించాక భక్తుల గోవిందనామస్మరణల నడుమ తిరుమల పోటు ఏఈవో గుండ్లూరు మునిరత్నం, అధికారులు ఊరేగింపుగా ఆంజనేయస్వామి ఆలయం వద్దకు తీసుకొచ్చారు.అక్కడ గంగమ్మ ఆలయ చైర్మన్‌ నైనారు మహేష్‌ యాదవ్‌కు సారెను అందజేశారు. తర్వాత ఈ సారెను తీసుకుని ఊరేగింపుగా కర్నాలవీధి, భేరివీధి, గాంధీరోడ్డు,బండ్ల వీధి, కాపు వీధుల మీదుగా తాతయ్యగుంట ఆలయానికి చేరుకున్నారు. తిరువీధుల గుండా వైభవంగా సాగిన ఈ ఊరేగింపులో డప్పుల మోతలు, కేరళ వాయిద్యాలు, తప్పెట్ల చప్పుళ్లు మార్మోగాయి. కోలాటం, గిరిజన నృత్యాలు అలరించాయి. నవదుర్గ వేషాలు కనువిందు చేశాయి. వివిధ రూపాల్లోని అమ్మవార్ల వేషధారణ ఆకట్టుకుంది. ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, జ్యోతుల నెహ్రూ, కార్పొరేషన్ల చైర్మన్లు నరసింహ యాదవ్‌, సుగుణమ్మ, రుద్రకోటి సదాశివం, శాప్‌ చైర్మన్‌ రవి నాయుడు, టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి, కూటమి పార్టీల నాయకులు ఆర్సీమునికృష్ణ,జేబీ శ్రీనివాస్‌, శ్రీధర్‌ వర్మ,సామంచి శ్రీనివాస్‌, రాజారెడ్డి, ఊట్ల సురేంద్ర నాయుడు, వినోద్‌ రాయల్‌, ఆముదాల వెంకటేష్‌, ఆర్సీ శ్రీనివాసులు, సుబ్బుయాదవ్‌, గుండాల గోపీనాథ రెడ్డి, గోవిందరాజస్వామి ఆలయ ఏఈవో ఏబీ నారాయణ చౌదరి, బొక్కసం ఇంచార్జి గురురాజ స్వామి, సూపరింటెండెంట్‌ శేషగిరి తదితరులు పాల్గొన్నారు. మరోవైపు గంగమ్మ జాతరను పురస్కరించుకుని శనివారం కైకాల, చాకలి కులస్తులు దొర వేషాన్ని ధరించి సందడి చేశారు. ఆదివారం మాతంగి వేషంతో భక్తులు మొక్కులు చెల్లించుకోనున్నారు.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement